సంక్రాంతి బ‌రిలో పైచేయి ఎవ‌రిది?

Tollwood movies in Sankranthi race
Tollwood movies in Sankranthi race

సినిమా వాళ్ల‌కి సంక్రాంతి సీజ‌న్ సెంటిమెంట్‌గా మారింది. ఈ సీజ‌న్‌లో సినిమా వ‌స్తే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఖాయం అనే సెంటిమెంట్ ని చాలా మంది హీరోలు ఫాలోఅవుతున్నారు. గ‌త కొన్నేళ్లుగా కొంత మంది హీరోలు సంక్రాంతికి త‌మ సినిమాని బ‌రిలోకి దింపాల‌ని, బాక్సాఫీస్ వ‌ద్ద త‌మ స‌త్తా ఏంటో చూపించాల‌ని పోటీప‌డుతూనే వున్నారు. కొంత మంది స‌క్సెస్ అయి త‌మ సెంటిమెంట్ నిజ‌మ‌ని నిరూపించుకుంటున్నారు. మ‌రి కొంత మంది బెట‌ర్ ల‌క్ నెక్స్ట్‌ టైమ్ అంటూ స‌రిపెట్టుకుని మరోసారి చూద్దాంలే అని సైడైపోతున్నారు. తాజాగా ఈ సంక్రాంతి స‌మ‌రానికి నాలుగు భారీ చిత్రాలు పోటీప‌డుతున్నాయి.
త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న ద‌ర్బార్‌, మ‌హేష్‌బాబు `స‌రిలేరు నీకెవ్వ‌రు`, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న` అల వైకుంఠ‌పుర‌ములో, నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ న‌టిస్తున్న `ఎంత మంచి వాడ‌వురా`..

ఈ నాలుగు చిత్రాలు దేనిక‌దే ప్ర‌త్యేక‌త‌తో వ‌స్తున్నాయి. ఇందులో ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న `ద‌ర్బార్‌` జ‌న‌వ‌రి 10న రిలీజ్ కాబోతోంది. చాలా కాలం త‌రువాత ర‌జ‌నీకాంత్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టించ‌డం, `స్పైడ‌ర్‌` ఘోర ప‌రాజం త‌రువాత ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌. మురుగ‌దాస్ చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే బిజినెస్ ప‌రంగా మాత్రం ఈ చిత్రానికి బ‌జ్ అంత‌గా లేదు. ఈ సినిమా త‌రువాత జ‌న‌వ‌రి 11న మ‌హేష్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` రిలీజ్ కాబోతోంది. మ‌హేష్‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌, కొంత విరామం త‌రువాత విజ‌య‌శాంతి న‌టిస్తున్న సినిమా కావ‌డం వంటి కార‌ణాల‌తో ఈ సినిమాపై కొంత బ‌జ్ మాత్రం ఏర్ప‌డింది. అయితే బ‌డ్జెట్ హ‌ద్దులు దాట‌డం, ఆడియో ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డం వంటి కార‌ణాలతో ఈ సినిమా సంక్రాంతి రేసులో కొంత వెన‌క‌బ‌డిందనే చెప్పాలి. ఈ సినిమా రిలీజైన ఒక్క రోజు తేడాలో అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రం జ‌న‌వ‌రి 12న విడుద‌ల‌వుతోంది.

ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన మూడు పాట‌ల‌ లిరిక‌ల్ వీడియోస్‌ని చిత్ర బృందం విడుద‌ల చేసింది. అందులో `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌..`, రాములో రాములా.. గీతాల‌కు రికార్డు స్థాయిలో స్పంద‌న ల‌భించింది. ఆడియో స‌క్సెస్‌తో ఇప్ప‌టికే రేసులో ముందున్న `అల వైకుంఠ‌పుర‌ములో` అన్నివిధాలుగా సంక్రాంతికి విజేత‌గా నిలిచే అవ‌కాశాలే అధికంగా వున్నాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ మూడు చిత్రాల‌తో పాటు జ‌న‌వ‌రి 15న  నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ న‌టిస్తున్న `ఎంత మంచి వాడ‌వురా` రిలీజ్ అవుతోంది. అయితే ఈ సినిమాకు ప‌బ్లిసిటీ మైన‌స్‌గా మారిన‌ట్టు తెలుస్తోంది. తొలిసారి ఆదిత్య మ్యూజిక్ వారు నిర్మాణరంగంలోకి ప్ర‌వేశించి నిర్మిస్తున్న ఈ సినిమాకు బాక్సాఫీస్ వ‌ద్ద క్రేజ్ ఏ మాత్ర‌మూ లేదు. దీంతో ఈ సినిమా సంక్రాంతి రేసులో వెన‌క‌బ‌డిపోయింది. నిర్మాత‌లు తేరుకోక‌పోతే సినిమా సంక్రాంతి బ‌రిలో వుంద‌న్న విష‌యం ప్రేక్ష‌కులు మ‌ర్చిపోయే ప్ర‌మాదం వుంది.