డిసెంబర్ 31 ట్రీట్ కు రెడీ అవుతోన్న టాలీవుడ్


డిసెంబర్ 31 ట్రీట్ కు రెడీ అవుతోన్న టాలీవుడ్
డిసెంబర్ 31 ట్రీట్ కు రెడీ అవుతోన్న టాలీవుడ్

ప్రతి సినిమాకు ప్రమోషన్స్ అనేవి అత్యంత కీలకం అన్న విషయం మనకు తెల్సిందే. ఆ సినిమా చిన్నదైనా, పెద్దదైనా ప్రమోషన్స్ లేకపోతే ఓపెనింగ్స్ రావడం కష్టమే. ఈ రోజుల్లో సినిమా అనేది వీకెండ్ బిజినెస్ అయిపోయింది కాబట్టి తొలి వీకెండ్ లోనే మాగ్జిమమ్ రెవిన్యూ రాబట్టుకోవాలి. ఇందుకోసం ప్రమోషన్స్ అనేవి కీలక పాత్ర పోషిస్తాయి. తమ ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు రాబట్టుకుంటే చాలు ఇక ఓపెనింగ్స్ కు ఢోకా ఉండదు. సినిమా రిలీజ్ అయ్యాక టాక్ బాగున్నా, బాగోకపోయినా సినిమా అయితే వీకెండ్ వరకూ నిలబడిపోతుంది. ఈ రకమైన ఉదాహరణలు మనం చాలానే చూసాం. సినిమాకు ప్రమోషన్లు ఎంత కీలకమో దాన్ని సరైన సమయంలో కూడా చేయడం కూడా అంతే ముఖ్యం. ఉదాహరణకు సినిమాకు సంబంధించి ఏదైనా ప్రోమో విడుదల చేయాలనుకుంటే అది ఏ పండగ నాడో, లేదా స్పెషల్ అకేషన్ సందర్భంగానో విడుదల చేస్తే రీచ్ ఎక్కువుంటుంది. లేదంటే ఎక్కువ మంది జనాలకు తెలిసే ఛాన్స్ ఉండదు.

అందుకే సినిమా వాళ్ళు, సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలకు తమ టీజర్ లు, ట్రైలర్ లు, ప్రోమోలు, పాటలు వంటివి విడుదల చేస్తుంటారు. ఇప్పుడు దసరా, దీపావళి అయిపోయాయి కాబట్టి టాలీవుడ్ కు ప్రమోషన్స్ చేసుకోవడానికి ముందున్న అకేషన్ న్యూ ఇయర్. అవును డిసెంబర్ 31 నైట్ ను టార్గెట్ చేసుకుని చాలా సినిమాలకు సంబంధించి ప్రమోషనల్ యాక్టివిటీస్ జరగనున్నాయి. డిసెంబర్ 31కి ఇంకా 42 రోజుల సమయం ఉన్నా ఇప్పటినుండే నిర్మాతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ 31న ఏ ఏ సినిమాలు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్స్ ప్లాన్ చేశాయో ఇప్పుడు చూద్దాం.

రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ ఫిక్షనల్ డ్రామా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాకు సంబంధించి ఫ్యాన్ మేడ్ స్కెచ్ లు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే ఇందులో ఏవీ అధికారికం కాదు. ఆర్ ఆర్ ఆర్ కు చెందిన ఫస్ట్ లుక్ పోస్టర్ డిసెంబర్ 31న రాబోతోందని సమాచారం. అలాగే ఎన్టీఆర్ లుక్, రామ్ చరణ్ లుక్ ఇలా విడివిడిగా కూడా పోస్టర్లు ప్లాన్ చేస్తున్నారట. ఇక సంక్రాంతి సినిమాలు అన్నీ డిసెంబర్ 31కి స్పెషల్ ట్రీట్స్ ప్లాన్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం నుండి ఒక అదిరిపోయే ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. అలాగే రజినీకాంత్ దర్బార్ నుండి కూడా ఒక ట్రైలర్ వస్తుందని సమాచారం. అల్లు అర్జున్ కూడా అల వైకుంఠపురములో నుండి ఏదొక ప్రమోషనల్ మెటీరియల్ ను సిద్ధం చేయమని చెప్పాడట. వాళ్ళ షెడ్యూల్ ప్రకారం అప్పటికే అల వైకుంఠపురములో ట్రైలర్ వచ్చేస్తుంది. ప్రమోషన్స్ విషయంలో చాలా ముందున్న వారు, ట్రైలర్ ను కూడా ముందుగానే సిద్ధం చేయాలని అనుకున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా ట్రైలర్ కూడా ఇదే రోజు రానుంది. ఇలా వరస ట్రీట్స్ తో తెలుగు ప్రజలను అలరించడానికి సిద్ధమవుతోంది టాలీవుడ్.