కరోనా ఎఫెక్ట్: మన హీరోలు టూర్లు మానుకుంటున్నారుకరోనా ఎఫెక్ట్: మన హీరోలు టూర్లు మానుకుంటున్నారు
కరోనా ఎఫెక్ట్: మన హీరోలు టూర్లు మానుకుంటున్నారు

కరోనా భయం గుప్పిట్లోకి ఇప్పుడు ఇండియా కూడా చేరింది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. నిన్నటితో కరోనా మరణాల సంఖ్య భారతదేశంలో 2 కు చేరుకుంది. దీంతో పలు రాష్ట్రాల్లో థియేటర్లు, షాపింగ్ మాల్స్, స్విమ్మింగ్ పూల్స్, జిమ్స్ వంటివన్నీ మూసివేస్తున్నారు. కేవలం మనదేశమనే కాక ఇతర దేశాల్లో ఈ ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉంది. చలి దేశాల్లో ఈ వైరస్ త్వరగా వ్యాపిస్తుందన్న వాదనలు ఉండడంతో ఆయా దేశాలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎవరైనా తమ దేశం వస్తే 14 రోజులు బయట ప్రపంచానికి దూరంగా ఉంచి టెస్ట్ లు చేసి పంపిస్తున్నారు. ప్రస్తుతం చాలా దేశాలు ఈ పద్ధతినే ఫాలో అవుతున్నాయి. సినిమా షూటింగ్స్ కు వెళ్ళడానికి కూడా సినిమా వాళ్ళు తటపటాయిస్తున్నారు. వీసాలు దొరకడం చాలా కష్టంగా ఉంది.

ఇదిలా ఉంటే సమ్మర్ వస్తోందనగానే మన టాలీవుడ్ స్టార్లు టూర్లు సిద్ధం చేసేసుకుంటున్నారు. రెండు నెలల ముందు నుండే ఏ దేశం వెళ్ళాలి వైగరా అంశాల మీద కసరత్తు మొదలవుతుంది. ఇక్కడ ఎండ మండించే ఆ సమయంలో చలి దేశాల్లో గడిపి రావడం మన స్టార్లకు అలవాటు అయిపోయింది. ప్రతీ ఏడాది లానే ఈసారి కూడా మన వాళ్ళు టూర్లకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు. హాలిడే అంటే ముందుండే మహేష్ ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి యూకే వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా టూర్స్ కు రెడీ అవుతున్నారు.

కానీ ఇప్పుడు కరోనా వల్ల విదేశాల్లో పరిస్థితి ఏం బాగోలేదు. ఇండియాలో కూడా ఆశాజనకంగా లేదు. అసలు జనాలు ఇంటి నుండి బయటకు రావడానికే ఇష్టపడట్లేదు. ఈ నేపథ్యంలో టాప్ హీరోలు ఈసారి సమ్మర్ టూర్ల విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ సమయానికి ఈ వైరస్ ఎఫెక్ట్ తగ్గితే ఓకే లేకపోతే ఈసారి ఎవరూ టూర్స్ కు వెళ్లకపోవచ్చు.