భారీ రెమ్యునరేషన్లతో హడలెత్తిస్తున్న తెలుగు యాంకర్లు


భారీ రెమ్యునరేషన్లతో హడలెత్తిస్తున్న తెలుగు యాంకర్లు
భారీ రెమ్యునరేషన్లతో హడలెత్తిస్తున్న తెలుగు యాంకర్లు

తెలుగు భాషలో ఉన్నంతమంది యాంకర్లు మరే భాషలోనూ ఉండరనిపిస్తుంది. అంతమంది యాంకర్లు తెలుగు టివి షోలలో, అవార్డు ఫంక్షన్ లలో, సినిమా ఈవెంట్ లలో హల్చల్ చేస్తుంటారు. తెలుగు యాంకర్లలో మహిళలే ఎక్కువగా హడావిడి చేస్తుండడం విశేషం. ఎక్కువ మంది మహిళా యాంకర్లు ఉన్నా ఎవరి స్టైల్ వాళ్ళకుండడంతో ఎవరికి వచ్చే షోస్ వాళ్లకు వస్తున్నాయి. మహిళా యాంకర్లలో అటు ట్రెడిషనల్ గా ఉండేవాళ్ళు ఉన్నారు, ఇటు గ్లామర్ ను ఒలకబోసే మహారాణులూ ఉన్నారు. దీంతో ఈవెంట్స్ కండక్ట్ చేసే వాళ్ళు ఎలాంటి ఫంక్షన్ ఆ టైప్ యాంకర్లను తీసుకుంటున్నారు. అయితే తెలుగులో యాంకర్ అన్న పదం వినపడగానే మొదట వినపడే పేరు సుమ. మలయాళం నుండి వచ్చిన సుమ మంచి వాగుడుకాయ. స్పాంటేనిటీ లో తోపు. సుమ మీద అంత త్వరగా పంచ్ లు వేయలేరు. ఒకవేళ వేసినా రివర్స్ పంచ్ వేయకుండా సుమ ఊరుకోదు. అయితే ఇదంతా చాలా స్పోర్టీవ్ గా జరిగేలా చూసుకుంటుంది. గెస్ట్ ను అసలు ఇబ్బంది పెట్టకుండా ఫన్ జనరేట్ చేయడంలో సుమను మించిన వాళ్ళు లేరు. యాంకర్ కు ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ పుణికిపుచ్చుకున్న సుమ, యాంకర్లలో టాప్. రెమ్యునరేషన్ విషయంలో కూడా సుమకు దగ్గరలో కూడా ఎవరూ లేరు. ఆమెను దాటి ఏ షో వెళ్ళదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా అవార్డు షోస్, సినిమా ఫంక్షన్లు అంటే సుమ ఉండాల్సిందే. ఒకవేళ ఆమె బిజీగా ఉంటేనో లేక అంత రేటు తట్టుకోలేమని సినిమా వాళ్ళు భావిస్తేనో వేరే యాంకర్ల దగ్గరకి వెళతారు.

నిత్యం షూట్లతో బిజీగా ఉండే సుమ రేటు వింటే ఆశ్చర్యపోవడం ఖాయం. ఒక్క అవార్డు ఫంక్షన్ కానీ సినిమా ఫంక్షన్ గాని చేసినందుకు సుమకు 3 లక్షల దాకా సమర్పించుకుంటారు. ఆమె షో చేస్తే ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది కాబట్టి ఆ రేటు ఇవ్వడంలో తప్పులేదని భావిస్తారు. ఇక టివి షోస్ కు అయితే 2 నుండి రెండున్నర లక్షల దాకా వెనకేస్తుంది. ఒక స్టార్ హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గని రెమ్యునరేషన్ తో సుమ టాప్ యాంకర్ గా స్థిరపడిపోయింది.

ఇక సుమ తర్వాతి స్థానం అనసూయదే అని చెప్పవచ్చు. గ్లామర్ ఒలికించడంలో అనసూయ తర్వాతే ఎవరైనా అన్నట్లుగా ఉంటుంది. జబర్దస్త్ షోకి మెయిన్ అట్రాక్షన్ గా కూడా మారింది. సినిమా ఫంక్షన్ లు తక్కువగానే చేస్తుంది కానీ ఏదైనా టివి షో చేయాలంటే మాత్రం 2 లక్షలు ఇచ్చుకోవాల్సిందే. అనసూయకు పోటీగా ఎక్స్ట్రా జబర్దస్త్ చేసే రష్మీ, గ్లామర్ విషయంలో ఏ మాత్రం తీసిపోదు. రెమ్యునరేషన్ విషయంలో కూడా. రష్మిక ఒక్కో షో కు లక్షన్నర దాకా ఛార్జ్ చేస్తుంది. సీనియర్ యాంకర్ ఝాన్సీ రేంజ్ కూడా ఇంచుమించు ఇంతే. ఇక ఇప్పుడిప్పుడే గ్లామర్ గా కనిపిస్తూ యాంకర్లుగా ఎదగాలని చూస్తున్న మంజూష, శ్యామల వంటి వారు ఒక సినిమా ఫంక్షన్ ను హోస్ట్ చేయడానికి 50 వేలు తీసుకుంటారు. బిగ్ బాస్ తర్వాత శ్రీముఖి రేంజ్ పెరిగింది కాబట్టి ఆమె ఎంత ఛార్జ్ చేస్తుందో చూడాలి.