ఈవారం ట్రేడ్ టాక్ ఇలా ఉంది మరి


Trade talk of this week tollywood
Trade talk of this week tollywood

డిసెంబర్ రెండో వారానికి వచ్చేసింది. పేరున్న సినిమాలన్నీ ఇకపై వరసగా క్యూ కడతాయి. అయితే ఇప్పటిదాకా విడుదలైన సినిమాల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ మొదటి వారంలో విడుదలైన సినిమాలు తుస్సుమనిపించడంతో నవంబర్ నెలాఖరులో విడుదలైన నిఖిల్ చిత్రం అర్జున్ సురవరం హవా కొనసాగింది. రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రం సేఫ్ జోన్ తొలి వారంలోనే చేరుకోవడం విశేషం. ఆ తర్వాత నుండి వచ్చినవన్నీ లాభాలే. ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లందరూ లాభాల బాట పట్టారు.

ఇక డిసెంబర్ మొదటి వారంలో విడుదలైన 90ml, భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు చిత్రాలు రెండూ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. గతేడాది ఆరెక్స్ 100తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన కార్తికేయ ఈ ఏడాది హీరోగా హ్యాట్రిక్ ప్లాపులు అందుకున్నాడు. అటు హిప్పీ, గుణ 369, ఇప్పుడు 90ml ఇలా మూడు చిత్రాలు కూడా ప్లాపయ్యాయి. 90ml ను డిజాస్టర్ కేటగిరీలో వేసేయొచ్చు. ఆఖరికి కార్తికేయ విలన్ గా చేసిన గ్యాంగ్ లీడర్ చిత్రం ప్లాపైంది. ఈ దారుణమైన రికార్డుతో ఈ యువ హీరో ఎలా కెరీర్ కొనసాగిస్తాడో చూడాలి.

ఇక కమెడియన్ శ్రీనివాస రెడ్డి దర్శకుడిగా, నిర్మాతగా మారి చేసిన ప్రయత్నం భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు. కమెడియన్ గా వచ్చిన పేరుని, డబ్బుని చాలా మటుకు ఈ చిత్రంతోనే పోగొట్టుకున్నాడు. ఇండస్ట్రీలోని కమెడియన్లందరినీ చాలా తక్కువ ధరకి మాట్లాడి ఈ సినిమాలో నటింపజేశాడు శ్రీనివాస రెడ్డి. లాభాలు వస్తే అందులోంచి సర్దవచ్చు అని భావించాడు కానీ ఈ చిత్రానికి పబ్లిసిటీ ఖర్చులు కూడా రాకపోవడం గమనార్హం. రెండో రోజు నుండే థియేటర్లు ఖాళీగా దర్శనమిచ్చిన పరిస్థితి.

ఇక నిన్న అమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదలైంది. టాక్ పరమ చెత్తగా వచ్చింది. అయితే చిత్రంపైన క్రేజ్ కారణంగా మొదటి రోజు చాలా చోట్ల హౌస్ ఫుల్స్ బోర్డులు దర్శనమిచ్చాయి. చాలా తక్కువ రేటుకి ఈ చిత్రాన్ని తెరకెక్కించడం వల్ల బయ్యర్లందరూ సేఫ్ జోన్ కు వెళ్లడం ఖాయం. ఇక ఈరోజు వెంకీ మామ విడుదలైన నేపథ్యంలో వచ్చే వారం ట్రేడ్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి.