అల వైకుంఠపురములో సక్సెస్ లో ఉన్న బన్నీకి చేదు వార్తఅల వైకుంఠపురములో సక్సెస్ లో ఉన్న బన్నీకి చేదు వార్త
అల వైకుంఠపురములో సక్సెస్ లో ఉన్న బన్నీకి చేదు వార్త

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంలో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. నా పేరు సూర్య ప్లాప్ తర్వాత ఎలాంటి సినిమా చేస్తే మంచిదన్న ఉద్దేశంతో ఏడాది పాటు బ్రేక్ తీసుకున్న బన్నీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ ను ఎంచుకుని అల వైకుంఠపురములో చేసాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెల్సిందే. వీక్ డేస్ అయినా కూడా అల వైకుంఠపురములో ఎక్కడా తగ్గట్లేదు. ఈ సినిమా అన్ని రికార్డులను కొల్లగొడుతూ చివరికి నాన్ బాహుబలి రికార్డులను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్నాడు.

ఇక ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ అల వైకుంఠపురములో టీమ్ రెండు సక్సెస్ మీట్ లను ప్లాన్ చేసింది. వైజాగ్ లో తలపెట్టిన సక్సెస్ మీట్ 19న పూర్తై గ్రాండ్ సక్సెస్ అవ్వగా, 24న తిరుపతిలో మరో సక్సెస్ మీట్ కు టీమ్ సమాయత్తమవుతోంది. ఇదిలా ఉంటే ఈ సక్సెస్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ కు ఒక చేదు వార్త.. బన్నీ తన బంధువును కోల్పోవాల్సి వచ్చింది. అల్లు ఫ్యామిలీకి చాలా దగ్గర చుట్టమైన ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ నిన్న రాత్రి విజయవాడలో గుండెపోటుతో మరణించారు.

ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్, అల్లు అర్జున్ కు మేనమామ. తల్లి నిర్మల దేవికి అన్నయ్య. ముత్తంశెట్టి మీడియా బ్యానర్ పై మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను నిర్మించనున్నారు. బన్నీ తన మేనమామకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామి అయ్యేలా చేసారు. షూటింగ్ కూడా త్వరలో మొదలుకావాల్సి ఉంది. ఈలోగానే ఇలా జరిగింది. ఈ వార్త తెలుసుకున్న అల్లు ఫ్యామిలీ హుటాహుటీన బెజవాడ చేరుకున్నారు.

అల్లు ఫ్యామిలీ, ముత్తంశెట్టి ఫ్యామిలీకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.