ట్రైల‌ర్ టాక్‌: `జాను` ఓ పొయేటిక్ ల‌వ్‌స్టోరీ!


Trailer talk Jaanu poetic love story
Trailer talk Jaanu poetic love story

ప్రేమ‌క‌థ‌లు ఎప్పుడూ మ‌ధుర‌మే. ప్ర‌తీ ఒక్క‌రి జీవితాల్లో ఏదో ఒక ద‌శ‌లో ప్రేమ‌లోప‌డ‌ని వారంటూ వుండ‌రు. అందుకే ప్రేమ‌క‌థ‌ల‌కు వెండితెర‌పై ఎప్పుడూ అప‌జ‌యం అన్న‌ది వుండ‌దు. దీంతో ఎక్కువ‌గా మేక‌ర్స్ ప్రేమ‌క‌థల్ని తెర‌పైకి తీసుకురావ‌డానికి అత్య‌ధికంగా ఆస‌క్తిని చూపిస్తుంటారు. తాజాగా అలాంటి ఓ ఫీల్‌గుడ్ ల‌వ్‌స్టోరీతో రూపొందుతున్న చిత్రం `జాను`. స‌మంత‌, శ‌ర్వానంద్ జంట‌గా న‌టిస్తున్నారు. ప్రేమ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

త‌మిళంలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు బాక్సాఫీస్ వ‌ద్ద అనూహ్య విజ‌యాన్ని సొంతం చేపుకున్న `96` ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. బుధ‌వారం ఈ చిత్ర ట్రైల‌ర్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. `ఎగిసిప‌డే కెర‌టానివి నువ్వు..ఎదురుచూసే స‌ముద్ర తీరాన్ని నేను. పిల్ల‌గాలి కోసం ఎదురుచూసే న‌ల్ల‌మ‌బ్బులా.. ఓర చూపుకోసం.. నీ దోర‌న‌వ్వు కోసం.. అంటూ శ‌ర్వానంద్ వాయిస్ ట్రైల‌ర్‌లో ఆక‌ట్టుకుంటోంది. ఒక్కోసారి జీవితంలో ఏదీ జ‌ర‌క్క‌పోయినా ఏదో జ‌ర‌గ‌బోతోంద‌ని మాత్రం మ‌న‌సుకి ముందే తెలిసిపోతుంటుంది` అని సామ్ చెప్పేమాట‌లు సినిమాలో వున్న ప్రేమ‌క‌థ, దాని భావోద్వేగాల సారాన్ని తెలియ‌జేస్తోంది.

ట్రైల‌ర్‌లో చూపించిన జాను, రామ్‌ల పాత్ర‌లు విడిపోయిన ఎంతో మంది ప్రేమ‌క‌థ‌ల్ని వారి జీవితాల్లో జీవిత‌పు అల‌ల మాటున హృద‌య‌పు లోతుల్లో దాగి వున్నభావోద్వేగాల్ని ఒక్కసారి మ‌ళ్లీ బ‌య‌టికి తీసిన ఫీలింగ్‌ని క‌లిగిస్తోంది. ఓ జంట మ‌ర‌పురాని ప్రేమ‌జ్ఞాప‌కాల నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.