`ఆర్ ఆర్ ఆర్‌`లో ఆ ఎపిసోడ్ రోమాంచితం!


`ఆర్ ఆర్ ఆర్‌`లో ఆ ఎపిసోడ్ రోమాంచితం!
`ఆర్ ఆర్ ఆర్‌`లో ఆ ఎపిసోడ్ రోమాంచితం!

రాజ‌మౌళి సాహ‌సోపేతంగా తెర‌కెక్కించిన `బాహుబ‌లి` దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంత‌రాలకు చాటిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ త‌రువాత జ‌క్క‌న్న చేస్తున్న సంచ‌ల‌న చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టిస్తుండ‌టంతో ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

తెలుగుతో పాటు త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. అంతే కాకుండా 10 ప్ర‌ధాన భార‌తీయ భాష‌ల్లో విడుద‌ల కానుంది. డీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ క్రేజీ స్టార్స్ అలియాభ‌ట్‌, అజ‌య్ దేవ్‌గ‌న్‌, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్‌స‌న్‌, ఒలివియా మోరీస్‌, అలీస‌న్ డూడీ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

దాదాపు 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్ బ‌య‌టికి వ‌చ్చింది. ఈ చిత్రంలో రోమాంచితంగా సాగే ట్రైన్ ఎపిసోడ్ ఒక‌టి వుంద‌ని, దీన్ని రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌పై ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్లాన్ చేసిన‌ట్టు తెలిసింది. ఈ ఎపిసోడ్ ని 30 రోజుల్లో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేశార‌ని, ఇందు కోసం ఓ ప్రైవేట్ స్టూడియోలో ట్రైన్ సెట్‌ని ప్ర‌త్యేకంగా నిర్మిస్తున్నార‌ని తెలిసింది. ఈ ఎపిసోడ్ సినిమాలో 3 నిమిషాల పాటు రోమాంచితంగా సాగ‌నుంద‌ని, ఇదే `ఆర్ ఆర్ ఆర్‌`కు మేజ‌ర్ హైలైట్‌గా నిల‌వ‌నుంద‌ని తెలిసింది.