
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మళ్లీ కలిసి నటించబోతున్నారా? .. వాళ్లిద్దరినీ మాటల మాంత్రికుడు మరోసారి కలపబోతున్నారా? అంటే టాలీవుడ్ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ భారీ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై ఎస్. రాధాకృష్ణ, హీరో నందమూరి కల్యాణ్‌రామ్ సంయుక్తంగా నిర్మించనున్నారు.
ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరపైకి రానున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి రానుంది. ఈ ఏడాదే ప్రారంభిం కావాల్సినా కరోనా వైరస్ కారణంగా రామ్‌చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` చిత్ర షూటింగ్ ఆలస్యం కావడంతో దాని ప్రభావం త్రివిక్రమ్ సినిమాపై పడింది. దీంతో కొంత సమయం చిక్కడంతో ఇటీవల ఈ చిత్ర స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దిన త్రివిక్రమ్ ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పాత్రని డిజైన్ చేశారట. ఆ పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్‌ని సంప్రదించే ఆలోచనలో వున్నట్టు తెలిసింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మోహన్ లాల్ కలిసి `జనతా గ్యారేజ్` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏ స్థాయి సంచలనం సృష్టించిందో తెలిసిందే. మరో సారి ఆ కాంబినేన్ రిపీట్ అవుతోందంటే ఫ్యాన్స్‌కు పండగే అంటున్నారు.