మాటల మాంత్రికుడు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే స్పెషల్


trivikram srinivas birthday special
trivikram srinivas birthday special

ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ అలియాస్ ఏఎన్ఎస్ ఈ పేరు గురించి మనకు పెద్దగా తెలియదు. అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పి చూడండి.. అక్షరం కొత్త గౌరవాన్ని సంతరించుకుంటుంది. అక్షరం ఇంత అందంగా ఉంటుందా అని మనకు అనిపిస్తుంది. మాటలతో మాయ చేయగల ఆయన నైపుణ్యాన్ని చూసి ముచ్చటేస్తుంది. ఆయన ఏం చెప్పినా వినాలనిపిస్తుంది, అందులోనుండి ఏదోకటి నేర్చుకోవచ్చనిపిస్తుంది. జీవితాన్ని కొత్త కోణంలో చూపించే త్రివిక్రముడు పుట్టినరోజు సందర్భంగా ఆయన మీద ప్రత్యేక కథనం.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో మాయ చేస్తాడు, సంచుల కొద్దీ పంచులు వేస్తాడు. కానీ ఆయన ఉద్దేశం పంచ్ వేయడం కాదు, మనకు ఏదొకటి తెలియజెప్పడం. మనుషులకు చాలా సరళంగా అర్ధమయ్యే భాషలో చెబితే వింటారు అని నమ్మి ఆ దిశగా ప్రయత్నిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు టాలీవుడ్ లో అగ్ర దర్శకుడు. కానీ ఆయన ప్రయాణం అంత సజావుగా సాగలేదు. డబ్బులు లేక తిండి తినకుండా పడుకున్న రోజులు ఉన్నాయి. కాళ్ళు జాపుకుని పడుకునే అంత రూమ్ కూడా దొరక్క కాళ్ళు ముడుచుకుని పడుకున్న రోజులున్నాయి. కష్టాలు అనుభవించాడు.. కానీ ఏనాడు కన్నీళ్లను రానివ్వలేదు. జీవితంలో సుఖాలూ చూసాడు.. దాన్ని కూడా నెత్తికెక్కించుకోలేదు.

నవంబర్ 7న భీమవరంలో అతి సామాన్య కుటుంబంలో జన్మించిన ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ బాల్యం నుండి చాలా తెలివిగల వాడు. చిన్నతనం నుండి సినిమాలంటే విపరీతమైన ఆసక్తి ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, చదువుని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. తను సినిమాల్లోకి వెళ్తానంటే చదువు అబ్బలేక అటు వెళుతున్నాడు అని అనుకోకూడదని, న్యూక్లియర్ ఫిజిక్స్ లో మాస్టర్ డిగ్రీ చేసాడు. యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించాడు. తర్వాత టీచర్ గా చేరినా ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ ఆలోచన ఎప్పుడూ సినిమాల మీదే ఉండేది. అందుకే హైదరాబాద్ కు వచ్చి సినిమాలలో పనిచేయడానికి వెతుకులాట మొదలుపెట్టాడు. ఆ సందర్భంగా కలిసిన వ్యక్తే సునీల్. ముందు రూమ్మేట్ అయ్యి, తర్వాత తన ద్వారానే సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుని ఈరోజు ఉన్నత స్థాయికి ఎదిగాడు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరితే.. దర్శకుడు అవ్వడానికి చాలా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అని తెలుసుకున్న ఏఎన్ఎస్ అసిస్టెంట్ రైటర్ గా పోసాని దగ్గర స్థానం సంపాదించగలిగాడు. పోసాని దగ్గర తక్కువ కాలంలో నమ్మకం సంపాదించుకున్న ఏఎన్ఎస్ సొంతంగా సీన్లు, డైలాగులు రాసే స్థానానికి ఎదిగాడు. గోకులంలో సీత సినిమాకి క్లైమాక్స్ సీన్, మాటలు రాసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ కావడం గమనార్హం. అయితే అసిస్టెంట్ రైటర్ గా చేస్తున్నప్పుడు వచ్చే డబ్బులు ఏ మూలకి సరిపోక ఆకలితో పని చేస్తున్న రోజులవి. సరిగ్గా ఆ సమయంలో దర్శకుడు విజయ్ భాస్కర్ తో జరిగిన పరిచయం తన కెరీర్ నే మార్చేసింది. స్వయంవరం తో రైటర్ గా మారిన ఏఎన్ఎస్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గా మారాడు. ఇక అక్కడినుండి వెనుతిరిగి చూసింది లేదు. సిందూరం, నువ్వే కావాలి, నిన్నే ప్రేమిస్తా, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు, వాసు, మల్లీశ్వరి వంటి సినిమాలకు పనిచేసాడు. వీటిలో దాదాపు అన్ని సినిమాలు హిట్ అవ్వడంతో పాటు త్రివిక్రమ్ కు మంచి పేరొచ్చింది.

నువ్వే నువ్వేతో దర్శకుడిగా మారిన త్రివిక్రమ్, చేస్తున్న ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు అగ్ర దర్శకుడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ అగ్ర దర్శకుడైనా, ప్రేక్షకులు మాత్రం మొదట త్రివిక్రమ్ అనగానే గుర్తు తెచ్చుకునేది ఆతని మాటలనే. ఏదైనా విషయాన్ని స్పష్టంగా ఎదుటివారికి అర్ధమయ్యే రీతిలో ఆసక్తికరంగా చెప్పగల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సినిమాల్లో మాటలే కాకుండా, బయట ఫంక్షన్స్ లో త్రివిక్రమ్ ఇచ్చే స్పీచ్ లకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రిని పొగుడుతూ ఇచ్చిన స్పీచ్ కానీ, నాన్నల గొప్పతనాన్ని చెబుతూ సన్నాఫ్ సత్యమూర్తి అప్పుడు మాట్లాడిన మాటలు కానీ, అ.. ఆ సినిమా విడుదల సమయంలో మనిషి చాలా చిన్న చిన్న పనులకే గొప్ప వ్యక్తి ఎలా కాగలడో చెప్పే స్పీచ్ కానీ ఇప్పటికీ అవి ఎవర్ గ్రీన్ గా మిగిలిపోతుంటాయి. లైఫ్ లో ఎప్పుడైనా కొంచెం లో గా అనిపించినా చాలు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్ లలో ఏదోకటి చూసినా జీవితం మీద ఆసక్తి కలుగుతుంది. ఏదొకటి చేయాలన్న తపన పెరుగుతుంది.

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అల వైకుంఠపురములో చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్, ఈ చిత్రంతో కూడా విజయం సాధించి కెరీర్ లో మరింత ఉన్నత స్థితికి చేరాలని కోరుకుందాం.