మెగా మూవీస్ తో త్రివిక్రమ్ బిజీ బిజీ


మెగా మూవీస్ తో త్రివిక్రమ్ బిజీ బిజీ
మెగా మూవీస్ తో త్రివిక్రమ్ బిజీ బిజీ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. తనపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనెర్స్ లో తనను కొట్టేవాడే లేడని మరోసారి నిరూపించాడు. అల వైకుంఠపురములో సక్సెస్ తో త్రివిక్రమ్ కు మునుపటి కంటే రెండింతలు ఎక్కువ క్రేజ్ వచ్చింది. స్టార్ హీరోలందరూ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి పోటీ పడుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ ఇప్పటికే ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి కమిటైన విషయం తెల్సిందే. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాలు మూడు మెగా కాంపౌండ్ లోనే ఉండనున్నాయని అంటున్నారు. ఎన్టీఆర్ సినిమా తర్వాత ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న రామ్ చరణ్ ప్రాజెక్ట్ ను చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఉన్న కమిట్మెంట్ కు త్రివిక్రమ్ వర్క్ చేయనున్నాడు. ఇద్దరూ కలిసి ఖైదీ నెం 150 తర్వాతే పనిచేయాల్సింది కానీ కుదర్లేదు. రామ్ చరణ్ ప్రాజెక్ట్ తర్వాత చిరంజీవితో సినిమాను చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.

ఈ మూడు సినిమాల తర్వాత అల్లు అర్జున్ తో మరోసారి త్రివిక్రమ్ జట్టుకట్టనున్నట్లు సమాచారం. ఇలా ఎన్టీఆర్ సినిమా తర్వాత వరసగా మూడు సినిమాలు మెగా హీరోలతోనే చేయనున్నాడు ఈ మాటల మాంత్రికుడు. మరి అనుకున్నట్లుగానే మెగా హీరోస్ తో సినిమాలు చేస్తాడా లేక మధ్యలో రూట్ మారుస్తాడా అన్నది చూడాలి. ఎందుకంటే త్రివిక్రమ్ తో పనిచేయడానికి మహేష్, ప్రభాస్ కూడా ఎదురుచూస్తున్నారు. ఇలా ఫుల్ డిమాండ్ ఉన్న దర్శకుడిగా త్రివిక్రమ్ హవా ఇప్పుడు మాములుగా లేదు.