పింక్ రీమేక్ లో హీరోయిన్లు.. అసలు కథేంటి?


పింక్ రీమేక్ లో హీరోయిన్లు.. అసలు కథేంటి?
పింక్ రీమేక్ లో హీరోయిన్లు.. అసలు కథేంటి?

గత కొద్ది కాలంగా కన్ఫ్యూజన్ లో పడిపోయిన పింక్ రీమేక్ వార్తలకు ఇప్పుడు మళ్ళీ ఊపొచ్చింది. పవన్ కళ్యాణ్ లేకపోయినా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే అధికారికంగా ఈ చిత్రానికి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలైనట్లు ప్రకటించారు. ప్రస్తుతం మాంచి జోష్ లో ఉన్న థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఈ సినిమాలో పాటలకు అంత ప్రాముఖ్యత ఉండదు. ఒరిజినల్ లో అయితే ఒకటే పాట ఉంటుంది, అది కూడా బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్. కానీ ఈ సినిమాకు రీరికార్డింగ్ చాలా ముఖ్యం. అందుకే థమన్ కు దిల్ రాజు అండ్ కో ఓటేసినట్లు సమాచారం.

అయితే ఇలా అధికారిక ప్రకటన వచ్చిందో లేదో, వెంటనే ఈ సినిమాలో నటించే హీరోయిన్లు వీళ్ళే అంటూ రకరకాల పేర్లు వినిపించడం మొదలుపెట్టాయి. సమంత ఇందులో తాప్సి రోల్ చేస్తోందని ఒకరు, కాదు పూజ హెగ్డే అని మరొకరు.. ఇలా వివిధ రకాల వార్తలు హల్చల్ చేయడం మొదలుపెట్టాయి. అయితే ఇవేమీ నిజం కాదని తేలిపోయింది. దిల్ రాజు అండ్ కో కు క్లోజ్ గా ఉండే సోర్స్ అందించిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటించే ముగ్గురు హీరోయిన్లలో ఇద్దరి ఎంపిక పూర్తయిందని సమాచారం. పింక్ లో అమితాబ్ బచ్చన్ పాత్రతో పాటు, తాప్సి, మరో ఇద్దరు కథానాయికల పాత్రలు చాలా ముఖ్యం. నిజానికి అమితాబ్ కంటే ఎక్కువ వీళ్ళకే స్క్రీన్ ప్రెజన్స్ ఎక్కువ ఉంటుంది.

ఈ నేపథ్యంలో తెలుగులో హీరోయిన్ల ఎంపిక చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అభినయానికి పేరున్న హీరోయిన్లనే సెలక్ట్ చేస్తున్నారు. నివేతా థామస్ ఒక హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అది నిజమేనని తెలుస్తోంది. అయితే అది తాప్సి రోల్ కోసం కాదట. అలాగే మరో హీరోయిన్ గా అంజలిని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. మరి మెయిన్ హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పింక్ లో నటించిన తాప్సినే సంప్రదించాలని భావిస్తున్నారు. మరి రీమేక్ పట్ల అనాసక్తిగా ఉండే తాప్సి పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే ఎస్ చెబుతుందా లేదా అన్నది వేచి చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.