రానున్న రెండు నెలల్లో మనల్ని అలరించబోయే సినిమాలివే


రానున్న రెండు నెలల్లో మనల్ని అలరించబోయే సినిమాలివే
రానున్న రెండు నెలల్లో మనల్ని అలరించబోయే సినిమాలివే

ప్రస్తుతం టాలీవుడ్ కు గడ్డు కాలం నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా సైరా నరసింహారెడ్డి విడుదల తర్వాత ఇప్పటివరకూ మరే తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. సైరా నరసింహారెడ్డి భారీ అంచనాల మధ్య విడుదలై 100 కోట్ల కలెక్షన్లు కేవలం తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే వసూలు చేసిన సంగతి తెల్సిందే. దీని తర్వాత ఏ తెలుగు చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దీపావళికి రెండు తమిళ అనువాదాలు సందడి చేసాయి. విజయ్ నటించిన విజిల్ ఓ మోస్తరుగా ఆడినా, కార్తీ నటించిన ఖైదీ మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే 15 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేయడం విశేషం. ఇక దాని తర్వాత మళ్ళీ టాలీవుడ్ కు స్లంప్ సీజన్ మొదలైంది.

సాధారణంగానే నవంబర్ నుండి డిసెంబర్ సగం వరకూ టాలీవుడ్ కు స్లంప్ సీజన్ గా పరిగణిస్తారు. ఈ కాలంలో పెద్ద సినిమాలు, పేరున్న సినిమాలు విడుదల చేయరు. అయితే అసలే స్లంప్ లో ఉన్న ఈ సీజన్ ఈసారి మరింత అద్వాన్నంగా తయారైంది. కనీసం 10 శాతం ఆక్యుపెన్సీ కూడా థియేటర్లలో ఉండట్లేదు. అలా అని సినిమాలు విడుదలవ్వట్లేదని కాదు. ప్రతీ వారం సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ వారం కూడా సందీప్ కిషన్ నటించిన తెనాలి రామకృష్ణ విడుదలై తొలిరోజు భయంకరమైన టాక్ తెచ్చుకుంది. సందీప్ కిషన్ కు మరో ప్లాప్ కన్ఫర్మ్. అయితే టాలీవుడ్ పరిస్థితి ఇలానే ఉండిపోదుగా. కొన్ని ఆసక్తికర సినిమాలు లైన్లో ఉన్నాయి. రానున్న కాలంలో ప్రేక్షకులను పలకరించబోయే సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

నవంబర్ : ఈ నెల ఇంకా రెండు వారాలు ఉంది. ఈ రెండు వారాల్లో ఏకంగా 5 సినిమాలు విడుదల కాబోతున్నాయి. నవంబర్ 22న ఈషా రెబ్బ, సత్యదేవ్ నటించిన థ్రిల్లర్ రాగల 24 గంటల్లో, ఉస్మానియా స్టూడెంట్ నాయకుడు జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్, బీచ్ రోడ్ చేతన్ అనే ఊరూ పేరు లేని సినిమాలు విడుదలవుతున్నాయి. ఇందులో జార్జ్ రెడ్డిపై అంచనాలు బాగున్నాయి. ఇక నవంబర్ 29న రామ్ గోపాల్ వర్మ బాగా హడావిడి చేస్తున్న కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, నిఖిల్ నటించిన అర్జున్ సురవరం విడుదలవుతున్నాయి. నిఖిల్ నటించిన సినిమానే అయినా ఏడాది నుండి వాయిదా పడుతూ వస్తుండడంతో అసలు బజ్ లేదు. ఇక వర్మ సినిమా గురించి చెప్పుకునేదేముంటుంది.

డిసెంబర్ : డిసెంబర్ మొదట్లో కార్తికేయ నటించిన 90ml సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కార్తికేయ ప్రస్తుతం ఫామ్ లో లేకపోవడంతో ఈ సినిమా హిట్ అవ్వడం తన కెరీర్ కు చాలా ముఖ్యం. విద్యార్థులను విదేశాలకు వెళ్ళమని ఒత్తిడి తెచ్చే పేరెంట్స్ కథాంశంతో తెరకెక్కిన ప్రెషర్ కుక్కర్ డిసెంబర్ 6న విడుదల కావొచ్చు. టీజర్ బాగుంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

డిసెంబర్ 13 : చిన్న సినిమాల తాకిడి అయింది. ఇక స్లంప్ కూడా ముగిస్తుంది కాబట్టి పెద్ద సినిమాలు సందడి చేయనున్నాయి. డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజు కావడంతో తన లేటెస్ట్ సినిమా వెంకీ మామను ఆ రోజే విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య వెంకటేష్ మేనల్లుడిగా నటిస్తోన్న విషయం తెల్సిందే.

డిసెంబర్ 20 : క్రిస్మస్ వీకెండ్ హాలిడే సీజన్ కావడంతో డిసెంబర్ 20న రెండు క్రేజ్ ఉన్న సినిమాలు మన ముందుకు వస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ప్రతిరోజూ పండగే, నందమూరి బాలకృష్ణ రూలర్.. ఈ రెండు చిత్రాలూ కూడా డిసెంబర్ 20కే వస్తున్నట్లు అధికారిక కన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసారు. సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి వంటి డీసెంట్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈసారి మరింత పెద్ద హిట్ కొట్టాలనుకుంటున్నాడు. బాలయ్య ఈ ఏడాది ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు పేరిట రెండు దారుణమైన ప్లాప్స్ ను చవిచూశాడు. ఈ నేపథ్యంలో రూలర్ హిట్ అవ్వడం బాలయ్య కెరీర్ కు చాలా ముఖ్యం.

క్రిస్మస్ నాడు రాజ్ తరుణ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇద్దరి లోకం ఒకటే విడుదలవ్వనుంది.

క్రిస్మస్ సీజన్ అయిపోయాక సందడంతా సంక్రాంతి సినిమాలదే.

ముందుగా జనవరి 10న రజినీకాంత్ దర్బార్ మన ముందుకు రానుంది. గత ఏడాది పేటతో ఓ మోస్తరు సక్సెస్ ను అందుకున్న రజినీ, ఈసారి మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చేసాడు. ఇక రెండు రోజుల తర్వాత జనవరి 12న బిగ్గెస్ట్ క్లాష్ అని చెప్పవచ్చు. అల్లు అర్జున్ నటిస్తోన్న అల వైకుంఠపురములో, మహేష్ బాబు నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు విడుదలవుతున్నాయి. ఇలా రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదలవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆ తర్వాత మూడు రోజులకు నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా చిత్రాన్ని షెడ్యూల్ చేసాడు. 118 తో పర్వాలేదనిపించింది కళ్యాణ్ రామ్ ఈసారి క్లాస్ సినిమాతో పండక్కి వచ్చి హిట్ కొట్టాలనుకుంటున్నాడు.

జనవరి 24న మాస్ మహారాజ రవితేజ నటించిన డిస్కో రాజా విడుదలకు షెడ్యూల్ అయింది. రవితేజ ప్రస్తుతం ప్లాప్స్ లో మగ్గుతున్నాడు. తన ఆఖరి మూడు సినిమాలు కూడా దారుణమైన ప్లాప్స్ ను చవిచూశాయి. దీంతో మాస్ మహారాజా కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. డిస్కో రాజా ఒక సైన్స్ ఫిక్షన్ కథ కావడంతో ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇదే రోజున అనుష్క నటించిన సైలెంట్ థ్రిల్లర్ నిశ్శబ్దం కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయి.

ఇవే వచ్చే రెండు నెలల్లో మనల్ని పలకరించే సినిమాలు. మరి వీటిలో ఎన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటాయో, ఎన్ని విఫలమవుతాయో చూడాలి.