`ఉప్పెన` మూవీ రివ్యూ

`ఉప్పెన` మూవీ రివ్యూ
`ఉప్పెన` మూవీ రివ్యూ

న‌టీన‌టులు:  వైష్ణ‌వ్ తేజ్‌, కృతిశెట్టి, విజ‌య్ సేతుప‌తి, గాయ‌త్రీ ర‌ఘురామన్‌, మాస్ట‌ర్ రాఘ‌వ‌న్ త‌దిత‌రులు న‌టించారు.
ద‌ర్శ‌క‌త్వం :  బుచ్చిబాబు సానా
నిర్మాతలు :  న‌వీన్ యెర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి, సుకుమార్‌‌
సంగీతం: ‌దేవిశ్రీ‌ప్ర‌సాద్‌
కెమెరా : శ‌్యామ్ కె ద‌త్ సైనొద్దీన్‌‌
ఎడిటింగ్ :  న‌వీన్ నూలి
రిలీజ్ డేట్ : 12- 02- 2021
రేటింగ్ : 3.25/5

ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన చిత్రం `ఉప్పెన‌`. లాక్‌డౌన్ కార‌ణంగా ఏడాది కాలంగా వాయ‌దా ప‌డుతూ వ‌చ్చిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. మెగా కాంపౌండ్ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్న వైష్ణ‌వ్‌తేజ్ సినిమా కావ‌డం కూడా ఈ చిత్రంపై అంచ‌నాల్ని పెంచేసింది. దీనికి తోడు స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కూడా మైత్రీతో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మించ‌డం మ‌రింత ఆస‌క్తిని రేకెత్తించింది. మెగాస్టార్, ప‌వ‌న్ తో పాటు చాలా మంది ప్ర‌శంస‌ల్లో ముంచెత్తి అండ‌గా నిలిచిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలోనే వుందా? .. తొలి చిత్రంతో వైష్ణ‌వ్‌తేజ్ ఆక‌ట్టుకున్నాడా? అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:
ప్రాణం కంటే ప‌రువు ముఖ్య‌మ‌నుకునే వ్య‌క్తి శేషా రాయ‌నం (విజ‌య్‌సేతుప‌తి). అత‌ని గారాల‌ప‌ట్టి సంగీత అలియాస్ బేబ‌మ్మ (కృతిశెట్టి). రోజూ బ‌స్సులో కాలేజీకి వెళ్లే సంగీత ఓ సాధ‌రాణ జాల‌రి కుటుంబానికి చెందిన ఆశీర్వాదం (వైష్ణ‌వ్‌తేజ్‌) ప్రేమ‌లో ప‌డుతుంది. ఎవ‌రికి తెలియ‌కుండా క‌లుసుకోవ‌డం మొద‌లుపెడ‌తారు. విష‌యం ఇంట్లో తెలియ‌డంతో ఇద్ద‌రూ ఊరిలోంచి పారిపోతారు. రాయ‌నం మాత్రం ఊళ్లో తెలిస్తే ప‌రువుపోతుంద‌ని ఆరు నెల‌ల త‌న కూతురు ఇంట్లోనే వుంద‌ని ఊరి జ‌నాన్ని న‌మ్మిస్తాడు. ఇంటి నుంచి పారిపోయిన సంగీత తిరిగి వ‌చ్చిందా?.. ప‌రువంటే ప్రాణ‌మిస్తే రాయ‌నం.. సంగీత, అశీల ప్రేమ‌ని అంగీక‌రించాడా? త‌న కులుం వాడుకాద‌ని అశీని రాయ‌నం ఏం చేశాడు? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులు న‌ట‌న‌:
ప్రేమ జంట‌గా న‌టించిన వైష్ణ‌వ్‌తేజ్‌, కృతిశెట్టి ఈ చిత్రానికి ప్రాణం పోశారు. హీరోహీరోయిన్‌లుగా ఇద్ద‌రికీ ఇదే తొలి సినిమా అయినా ఎంతో అనుభ‌వం వున్న న‌టుల్లా పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. వైష్ణ‌వ్ తెర‌పై క‌నిపించిన విధానంతో పాటు.. భావోద్వేగాలు ప‌లికించిన తీరులో అనుభ‌వం వున్న న‌టుడిలా ప‌రిణ‌తి క‌నిపిస్తుంది. కృథి త‌న అందంతో క‌ట్టిప‌డేసింది. సంగీత పాత్ర‌లో ఒదిగిపోయింది. ప‌తాక ఘ‌ట్టాల్లో ఆమె క‌న‌బ‌రిచిన అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది. రాయ‌నం పాత్ర‌లో విజ‌య్ సేతుప‌తి న‌టించారు. ఆయ‌న పాత్రే ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లం. క‌థ‌నాయ‌కుడిగా తండ్రిగా సాయిచంద్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. ఇందులో కృతిశెట్టికి త‌ల్లిగా గాయ‌త్రీ రాఘ‌రామ‌న్ న‌టించారు. త‌న పాత్ర ప‌రిధిమేర‌కు న‌టించి మెప్పించారు.

సాంకేతిక వ‌ర్గం ప‌ని తీరు:
ఈ మూవీ విష‌యంలో సాంకేతిక విభాగాలు చ‌క్క‌ని ప‌ని తీరుని క‌న‌బ‌రిచాయి. ప్ర‌ధానంగా దేవిశ్రీప్ర‌‌సాద్ అందించిన పాట‌లు, నేప‌థ్య సంగీతం ఈ చిత్రానికి ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. కెమెరామెన్ శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ ఫొటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకుంటుంది. స‌ముద్ర‌తీర ప్రేమ‌క‌థ కావ‌డంతో విజువ‌ల్స్ క‌ను విందుగా వున్నాయి. ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా ఓ స‌రికొత్త ప్రేమ‌క‌థ‌ని అందించారు. క్లైమాక్స్ ప‌రంగా త‌న‌దైన మార్కుని చూపించారు.

తీర్పు:
పేదింటి కుర్రాడు, పెద్దింటి అమ్మాయి.. మ‌ధ్య ప్రేమ‌.. కులాలు, అంత‌స్థులు అంత‌రం నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో చిత్రాలొచ్చాయి. ఇలాంటి క‌థ తెలుగు తెర‌కు  ప్రేక్ష‌కుల‌కు కొత్తేమీ కాదు. అయితే ఆ క‌థ‌కు త‌న‌దైన మార్కు క్లైమాక్స్‌ని జోడించి స‌రికొత్త ప్రేమ‌క‌థ‌ని ఆవిష్క‌రించ‌డంలో ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌క్సెస్ అయ్యారు. అయితే మ‌థ్య‌లో కొన్ని స‌న్నివేశాల్ని మ‌రింత బాగా రాసుకుని వుంటే ఫ‌లితం మ‌రింత బాగుండేది. ఓవ‌రాల్ గా స‌గ‌టు ప్రేమికుల‌కు, యూత్‌కి అమితంగా న‌చ్చే చిత్ర‌మిది.