`జాతిర‌త్నాలు` డైరెక్ట‌ర్‌తో వైష్ణ‌వ్ తేజ్‌?

Vaishanav tej and anudeep k.v team up
Vaishanav tej and anudeep k.v team up

బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ల‌ని సొంతం చేసుకున్న హీరోలు, ద‌ర్శ‌కులు వెంట‌నే మ‌రో చిత్రాన్ని ప్రారంభించ‌డానికి వెనుకాడ‌టం లేదు. ఇలాంటి వారి కోసం భారీ నిర్మాణ సంస్థ‌లు కూడా పోటీప‌డి మ‌రీ ముందుకొస్తున్నాయి. భారీగా బ‌డ్జెట్‌ని కేటాయించి సినిమాలు తీయాల‌ని ప్లాన్ లు వేస్తున్నాయి. తాజాగా `ఉప్పెన‌` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్న వైష్ణ‌వ్ తేజ్‌, `జాతిర‌త్నాలు` వంటి హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో అదే స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు అనుదీప్ కేవీ క‌లిసి ఓ భారీ చిత్రం చేయ‌బోతున్నారు.

ఈ చిత్రానికి నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నార‌ట‌. `ఉప్పెన‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం రిలీజ్‌కి ముందే వైష్ణ‌వ్ తేజ్ డైరెక్ట‌ర్ క్రిష్‌తో ఓ గ్రామీణ ప్రేమ‌క‌థా చిత్రాన్ని చేశారు. ఇది రికార్డు స్థాయి వేగంతో పూర్త‌యి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఈ మూవీ రిలీజ్‌కి రెడీ అవుతున్న నేప‌థ్యంలో `జాతిర‌త్నాలు` ద‌ర్శ‌కుడితో మ‌రో సినిమా అంగీక‌రించ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

`జాతిర‌త్నాలు`తో అనుదీప్‌, `ఉప్పెన‌` వైష్ణ‌వ్ తేజ్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ల‌ని సొంతం చేసుకున్నారు. మ‌రి ఈ ఇద్ద‌రు క‌లిసి ఎలాంటి చిత్రాన్ని చేయ‌బోతున్నారు? .. అది ఎలా వుండ‌బోతోంది? అన్న‌ది మాత్రం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.