కొత్త మెగా కుర్రాడు ఆకట్టుకుంటున్నాడే!


కొత్త మెగా కుర్రాడు ఆకట్టుకుంటున్నాడే!
కొత్త మెగా కుర్రాడు ఆకట్టుకుంటున్నాడే!

మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే చాలా మంది హీరోలు ఇండస్ట్రీలో తమదైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ అంటూ చాలా మందే హీరోలు ఉన్నారు. అయితే వీరు కాకుండా ఇప్పుడు మరో మెగా హీరో ఇండస్ట్రీకి పరిచయమవుతుండడంపై భిన్నమైన కామెంట్లు వినిపించాయి. ఒకే ఫ్యామిలీ నుండి ఎంత మంది హీరోలురా అన్న వాళ్ళూ ఉన్నారు. ఎంత మంది వస్తే ఏంటి టాలెంట్ ఉంటేనే ఇక్కడ పనవుతుంది అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఇప్పుడు హీరోగా మన ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయమవుతూ వైష్ణవ్ తేజ్ ను తెరకు పరిచయం చేస్తూ నిర్మించిన సినిమా ఉప్పెన. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం పాటు సాగింది. అప్పట్లో ఈ సినిమాపై రకరకాల రూమర్లు వినిపించాయి. అయితే ప్రమోషన్స్ మొదలైన దగ్గరనుండీ ఈ సినిమా స్వరూపమే మారిపోయింది. ఇప్పటిదాకా విడుదలైన రెండు పాటలకూ రెస్పాన్స్ అదిరిపోయింది. నిన్న విడుదలైన ధక్ ధక్ ధక్ సాంగ్ లో హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది.

ఇప్పటిదాకా విడుదలైన దాన్నిబట్టి వైష్ణవ్ తేజ్ కూడా ఆకట్టుకునేలానే ఉన్నాడు. మరి చూస్తుంటే ఉప్పెన ఈ కుర్రాడి కెరీర్ కు సరైన ఆరంభంలా అనిపిస్తోంది. ఏప్రిల్ 2న ఉప్పెన విడుదలవుతోంది. వైష్ణవ్ తేజ్ పక్కన కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతోంది. ఈమె కూడా తన క్యూట్ లుక్స్ తో స్మైల్ తో యువత మనసును దోచేస్తోంది. సుకుమార్ బ్యాకింగ్ ఉంది కనుక సినిమాపై మంచి అంచనాలే ఏర్పడుతున్నాయి. మైత్రి మూవీస్ వాళ్ళు కూడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించినట్లు అర్ధమవుతోంది. ఉగాది టైమ్ కు ట్రైలర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూస్తుంటే మరో మెగా కుర్రాడు కూడా ఆకట్టుకునేలానే ఉన్నాడు.