మహేష్ సరసన మరోసారి బాలీవుడ్ భామ?మహేష్ సరసన మరోసారి బాలీవుడ్ భామ?
మహేష్ సరసన మరోసారి బాలీవుడ్ భామ?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు విడుదలై 10 రోజులు దాటిపోయింది. నిన్నటి నుండి సినిమా కలెక్షన్స్ కూడా తగ్గుముఖం పట్టాయి. ఇక ఇప్పటికే బయ్యర్లందరూ లాభాల్లోకి వెళ్లడంతో అందరూ హ్యాపీ. ఇక సరిలేరు నీకెవ్వరు నుండి నెమ్మదిగా ఫోకస్ మహేష్ బాబు 27వ చిత్రం మీదకి మళ్లుతోంది. ఇప్పటికే మహేష్ తన తర్వాతి చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉంటుందని అధికారికంగా ప్రకటించాడు. మహర్షి సినిమా సమయంలోనే తన పనితనం నచ్చి మహేష్ సినిమా ఆఫర్ ఇచ్చాడు. ప్రస్తుతం మహేష్ యూఎస్ ట్రిప్ లో ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరు కోసం అవిశ్రాతంగా కష్టపడ్డ మహేష్ ఇప్పుడు హాలిడే తీసుకుంటున్నాడు. రెండు నెలల తర్వాత కానీ తన తర్వాతి సినిమా గురించి ఆలోచించకూడదు అని అనుకుంటున్నాడు.

మరోవైపు వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను చక్కబెడుతున్నాడు. చిత్ర నటీనటులను, సాంకేతిక నిపుణులను ఫైనలైజ్ చేస్తున్నాడు. సంగీత దర్శకుడిగా థమన్ ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే. ఇక హీరోయిన్ గా ఎవరిని సెలక్ట్ చేయాలా అన్న మీమాంశలో ఉన్నాడు వంశీ. ఈ చిత్రానికి కొత్త హీరోయిన్ అయితే బాగుంటుందని భావిస్తున్నాడు. అలాగే భరత్ అనే నేనులో మహేష్ సరసన నటించి మెప్పించిన కియారా అయితే ఎలా ఉంటుందా అన్న ఆలోచన కూడా ఉందిట.

అయితే ప్రస్తుతం కియారా ఫుల్ బిజీగా ఉంది. మహేష్ చిత్రం కోసం బల్క్ డేట్స్ అవసరమైతే అడ్జస్ట్ చేయగలదా అన్నది చూడాలి. ఇక కొత్త హీరోయిన్ వైపు వెళ్తే ఎలాంటి అమ్మాయిని సెలక్ట్ చేస్తారోనన్న అనుమానాలు కూడా అభిమానులకు ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా మహేష్ ముందు సాదాసీదాగా ఉంటే తేలిపోతారు.

ఈ సినిమా షూటింగ్ మే నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమా లాంచ్ కు కూడా ఇంకా చాలా సమయం ఉంది. ఈలోపు ఎన్నో  మార్పులు జరగొచ్చు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.