వరుణ్ తేజ్ కోసం ప్లాప్ దర్శకుడ్ని సెట్ చేస్తున్న మెగా నిర్మాతvarun tej to act in flop directors movie
varun tej to act in flop directors movie

మెగా హీరో వరుణ్ తేజ్ మొదటినుండి తన కథల ఎంపికలతో ఇంప్రెస్ చేస్తున్నాడు. మొదటి సినిమానే ఏ మాత్రం కమర్షియల్ అంశాలు లేని ముకుందను ఎంచుకున్న వరుణ్ తేజ్, తర్వాత కూడా కమర్షియల్ పంథాలో నడవకుండా కంచె వంటి అవార్డు విన్నింగ్ సినిమాను చేసాడు. అయితే కథల విషయంలో మధ్యలో ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకున్న వరుణ్ తేజ్ తొలిప్రేమ, ఎఫ్ 2, గడ్డలకొండ గణేష్ వంటి రీసెంట్ చిత్రాల విజయాలతో 25 కోట్ల మార్కెట్ ఉన్న హీరోలలో ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాడు.

గద్దలకొండ గణేష్ లో నెగటివ్ ఛాయలున్న పాత్రను చేసిన వరుణ్ తేజ్, ఈసారి బాక్సర్ అవతారం ఎత్తబోతున్నాడు. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి చెప్పిన కథకు ఫ్లాట్ అయిన వరుణ్ తేజ్ అతనికి అవకాశం ఇచ్చాడు. అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం బాక్సర్ గా సరైన ఫిజిక్ ను, లుక్ ను తీర్చిదిద్దుకునే పనిలో పడ్డాడు వరుణ్ తేజ్. వచ్చే ఏడాది మొదట్లో ఈ చిత్రం ప్రారంభమై వేసవికి కానీ, ఆగష్టు నెలలో కానీ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు వరుణ్ తేజ్ ఆ తర్వాతి చిత్రం గురించి కూడా ప్రచారం మొదలైపోయింది.

ప్రస్తుతం చేయనున్న బాక్సర్ చిత్రాన్ని కొడుకు నిర్మిస్తుంటే, ఆ తర్వాతి వరుణ్ సినిమాను తండ్రి నిర్మించనున్నాడట. అవును, అల్లు అరవింద్ నిర్మాణంలో, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వరుణ్ తేజ్ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇటీవలే వక్కంతం వంశీ వరుణ్ తేజ్ ను కలిసి ఒక కథ చెప్పాడట. ఆ లైన్ వరుణ్ కు విపరీతంగా నచ్చినట్లు తప్పకుండా ఈ సినిమా అయ్యాక చేద్దామన్నట్లు వార్తలు వచ్చాయి. ఈలోగా పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ ను సిద్ధం చేయమని కూడా వరుణ్ చెప్పినట్లు తెలుస్తోంది.

రచయితగా వక్కంతం వంశీకి టాలీవుడ్ లో అపార అనుభవం ఉంది. కిక్, కిక్ 2, అతిధి, రేసుగుర్రం, టెంపర్ వంటి చిత్రాలకు రచన చేసి మంచి పేరే తెచ్చుకున్న వక్కంతం వంశీ తన దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రాన్ని చేసాడు. ఈ సినిమా ప్లాప్ అవ్వడంతో వక్కంతం వంశీకి వెంటనే మరో సినిమా రాలేదు.

ఈ సినిమా ప్లాప్ తర్వాత అల్లు అర్జున్ కూడా దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దాని తర్వాత సుకుమార్ సినిమాను కూడా సెట్ చేసాడు అల్లు అర్జున్. నా పేరు సూర్య సినిమా ఫలితం తర్వాత వక్కంతం వంశీ గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లోనే ఉన్నాడు. అక్కడే కథలను సిద్ధం చేస్తున్న వంశీకి ఇప్పుడు వరుణ్ తేజ్ ప్రాజెక్ట్ సెట్ అయ్యేలా ఉంది. చూడాలి మరి ఫైనల్ గా ఏం అవుతుందో.