అసురన్ రీమేక్ కు టైటిల్ ఫిక్స్ అయినట్టేనా?


Venkatesh Asuran remake titled Narappa
Venkatesh Asuran remake titled Narappa

2019లో విక్టరీ వెంకటేష్ ఫుల్ ఫ్లో లో ఉన్నాడు. ఆయన నటించిన ఎఫ్ 2, వెంకీ మామ చిత్రాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అంతే కాదు ఈ రెండూ మల్టీస్టారర్లే. వెంకీ రోల్ కే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది ఈ రెండు సినిమాల్లోనూ. ఆ రకంగా వెంకటేష్ ఇప్పుడు ఫుల్ ఫ్లో లో ఉన్నాడు. ఇక 2020ను మొదలుపెట్టడానికి వెంకీ మామ సిద్దమవుతున్నాడు. అసురన్ రీమేక్ లో వెంకీ నటించనున్న సంగతి తెల్సిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. మరో రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అనంతపూర్ లో ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో అనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో షూటింగ్ జరగనుంది.

వెంకటేష్ ఈ చిత్రంలో మధ్యవయస్కుడి పాత్రలో నటించనున్నాడు. ఆ రోల్ కు తగ్గట్లుగా గుబురుగా గెడ్డం పెంచి కనిపిస్తున్నాడు వెంకీ. ఈ చిత్రంలో మెజారిటీ  నటీనటులను కొత్తవాళ్లను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికి తగినట్లుగా ఎంపిక కూడా పూర్తయింది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నారప్ప అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో వెంకటేష్ పాత్రకు ఇదే పేరు అనుకుంటున్నారు. అందుకే టైటిల్ కూడా అదే ఉంటే  బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నట్లు వినికిడి. ప్రస్తుతం మణిశర్మ మంచి ఫ్లో లో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ విజయం తర్వాత అతనికి అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే రామ్ నటిస్తోన్న రెడ్, పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ ఫైటర్, చిరంజీవి – కొరటాల శివ చిత్రాలకు పనిచేస్తున్న మణిశర్మ ఇప్పుడు వెంకటేష్ నారప్పకు కూడా వర్క్ చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని  వివరాలు త్వరలో తెలుస్తాయి.