నారప్పలో వెంకటేష్ పెద్ద కొడుకు ఇతనే!


నారప్పలో వెంకటేష్ పెద్ద కొడుకు ఇతనే!
నారప్పలో వెంకటేష్ పెద్ద కొడుకు ఇతనే!

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న విషయం తెల్సిందే. గతేడాది వెంకీ నటించిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అదే ఉత్సాహంతో వెంకటేష్ ఈ ఏడాది నారప్ప షూటింగ్ ను మొదలుపెట్టిన సంగతి తెల్సిందే. గతేడాది తమిళంలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన అసురన్ చిత్రానికి ఇది రీమేక్. ధనుష్ హీరోగా వచ్చిన ఈ సినిమా అటు కమర్షియల్ గా సక్సెస్ అవ్వడంతో పాటు ఇటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

బ్రహ్మోత్సవం ఇచ్చిన ఎఫెక్ట్ తో పూర్తిగా సైడ్ అయిపోయిన శ్రీకాంత అడ్డాల ఈ రీమేక్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా కరోనా వైరస్ కారణంగా బ్రేక్ పడిన విషయం తెల్సిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ పాటికి విడుదలైపోయేదే.

పాత్ర పరంగా ఇందులో వెంకటేష్ మధ్య వయస్కుడి పాత్ర పోషిస్తున్నాడు. కథ ప్రకారంగా ఇందులో వెంకటేష్ కు ఇద్దరు కొడుకులు ఉంటారు. పెళ్లీడుకి వచ్చిన పెద్ద కొడుకు పాత్రను ఈ రోజు సురేష్ ప్రొడక్షన్స్ రివీల్ చేసింది. కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో అందరినీ ఆకట్టుకున్న కార్తీక్ రత్నం వెంకటేష్ పెద్ద కొడుకుగా నటిస్తున్నాడు. ఈరోజు కార్తీక్ రత్నం పుట్టినరోజు సందర్భంగా అతనికి విషెస్ తెలుపుతూ పోస్టర్ ను విడుదల చేసింది నారప్ప టీం. ఇక వెంకటేష్ భార్యగా ప్రియమణి నటిస్తోంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.