సరైన దర్శకుడి కోసం వెంకీ వెతుకులాట


సరైన దర్శకుడి కోసం వెంకీ వెతుకులాట
సరైన దర్శకుడి కోసం వెంకీ వెతుకులాట

విక్టరీ వెంకటేష్ ఇప్పుడు డైలమాలో పడ్డాడు. అవి కూడా రెండు రకాల డైలామాలు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. వెంకటేష్ ప్రస్తుతం వెంకీ మామ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. అక్కినేని నాగ చైతన్యతో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు వెంకటేష్. ఇప్పటికే తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసుకుని తన తర్వాతి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. వెంకీ మామ రిలీజ్ పై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. ఈ చిత్రం డిసెంబర్ లోనే విడుదల కావాల్సి ఉన్నా ఎందుకు ఆలస్యమవుతోందో తెలీదు. నిర్మాణ సంస్థ నుండి కూడా ఎటువంటి అప్డేట్ లేదు. జనవరి లాస్ట్ వీక్ లో కానీ ఫిబ్రవరిలో కానీ విడుదల కావొచ్చు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. నాగ చైతన్య సరసన రాశి ఖన్నా చేస్తోంది. బాబీ ఈ చిత్రానికి దర్శకుడు.

వెంకీ మామ వెంకటేష్ కెరీర్ లో 73వ చిత్రం. మరో చిత్రం చేస్తే వెంకటేష్ మైల్ స్టోన్ 75వ చిత్రానికి చేరువవుతాడు. ఇప్పుడిదే వెంకటేష్ ను కన్ఫ్యూజన్ కు గురి చేస్తోంది. 75వ సినిమా అంటే అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేయకూడదు. అనుభవమున్న దర్శకుడైతే చాలా బెటర్. ఇప్పుడిదే వెంకీకు చిక్కుగా మారింది. ప్రస్తుతం వెంకటేష్ రెండు చిత్రాలకు కమిటై ఉన్నాడు. ఒకటి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఇప్పటికే ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది. సొంత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ దీన్ని నిర్మిస్తోంది. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ హీరోగా మీకు మాత్రమే చెప్తా అనే చిత్రం నవంబర్ 1న విడుదల కానుంది. ఆ చిత్ర హడావిడి మొత్తం పూర్తయ్యాక తరుణ్ భాస్కర్, వెంకటేష్ చిత్రానికి తుది మెరుగులు దిద్ది ప్రాజెక్ట్ ను పట్టాలెక్కిస్తాడు.

ఈ చిత్రం కాకుండా వెంకటేష్ ఇటీవలే ఒక రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడు. అసురన్ చూసిన వెంటనే తెగ నచ్చేసి మరో ఆలోచన లేకుండా వెంకటేష్ ఈ చిత్ర హక్కుల్ని సురేష్ బాబుతో కలిసి చెన్నై వెళ్లి మరీ కొనుక్కుని వచ్చాడు. అసురన్ కథగా చూస్తే ఒక సామాన్య ప్రతీకార కథలా అనిపిస్తుంది. తక్కువ కులం వాళ్ళు, డబ్బున్న వాళ్ళు మధ్య జరిగిన ఘర్షణ అసురన్ లో ప్రధాన పాయింట్. తమిళంలో 100 కోట్ల క్లబ్ లో చేరిందీ చిత్రం. అయితే ఇది వెంకటేష్ కు అసలు సూట్ అవ్వదని అనేవాళ్ళు ఎక్కువయ్యారు. పైగా సరిగ్గా తీయకపోతే ఈ ఒరిజినల్ ఫ్లేవర్ పాడవుతుంది. అందుకే అసురన్ ను హ్యాండిల్ చేయగల సమర్ధుడైన దర్శకుడ్ని వెతుకుతున్నారు. ఇదే ఫ్లో లో చేస్తే అసురన్ వెంకటేష్ 75వ చిత్రం అవ్వాలి. కానీ వెంకటేష్ కు తన మైల్ స్టోన్ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయాలని ఉంది. ఇద్దరి మధ్య ఆల్రెడీ ఈ విషయంలో కమిట్మెంట్ ఉంది. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ విషయాన్ని చెప్పాడు కూడా. ఒకవేళ త్రివిక్రమ్ 75వ సినిమా చేస్తే అసురన్ రీమేక్ ను వాయిదా వేయాలా? లేక అసురన్ రీమేక్ ను ముందు చేసి తరుణ్ భాస్కర్ తో చిత్రాన్ని వెనక్కి తోయాలా? అసలు త్రివిక్రమ్ తో సినిమా పట్టాలెక్కుతుందా? ఇన్ని కన్ఫ్యూజన్స్ మధ్య ఉన్నాడు వెంకీ.