పాయల్ ను కావాలనే సైడ్ చేస్తున్నారా?


పాయల్ ను కావాలనే సైడ్ చేస్తున్నారా?
పాయల్ ను కావాలనే సైడ్ చేస్తున్నారా?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావడం ఒకెత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే పెద్ద కష్టం. తొలి సినిమాతో సక్సెస్ సాధించినా తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలో తెలీక తికమకపడి ఏదోకటి చేసేసి కెరీర్ ను పణంగా పెట్టిన వారు కోకొల్లలు. సక్సెస్ ను నిలబెట్టుకోవడంలో లేటెస్ట్ గా వైఫల్యం చెందుతోంది పాయల్ రాజ్ పుత్. ఏ హీరోయిన్ కు రాని డ్రీం డెబ్యూ ఆరెక్స్ 100 ద్వారా పాయల్ కు దక్కింది. ఈ సినిమాతో ఆమె పేరు యూత్ లో మార్మోగిపోయింది. ఆమెకు క్రేజ్ ఎన్నో రెట్లు పెరిగిపోయింది. ఆ సినిమా సక్సెస్ తో పాయల్ కు ఆఫర్లు కూడా భారీగానే వచ్చాయి. అయితే చాలా మందిలానే ఆమెకు అందులోనుండి మంచి ఆఫర్లు ఏంటో తెలుసుకోలేకపోయింది. ఆరెక్స్ 100 తర్వాత ఆ ఇమేజ్ కు పూర్తి భిన్నమైన ఇమేజ్ తో మరో సినిమా చేసి ఉంటే ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. కానీ పాయల్ లస్ట్ లాంటి ఇమేజ్ ను కంటిన్యూ చేయాలనీ చూసింది.

ఆరెక్స్ 100 తర్వాత సీత సినిమాలో బుల్ రెడ్డి అనే ఐటెం సాంగ్ చేసింది. దీని వల్ల ఆమెకు ఒరిగింది అంటూ ఏమీ లేదు. ఇక దాని తర్వాత చేసిన ఆర్డీఎక్స్ లవ్ ఆమె ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ చేసింది. లస్ట్ సినిమాల్లోనే పీక్స్ వంటి ఆ సినిమాను ఆమె ఒప్పుకుని చాలా పెద్ద తప్పు చేసింది. అయితే పాయల్ చేసిన మంచి పని ఏంటంటే ఆర్డీఎక్స్ లవ్ టీజర్ కూడా విడుదల కాకముందే ఆమె వెంకీ మామ, డిస్కో రాజా సినిమాలకు సైన్ చేసింది. అయితే ఆర్డీఎక్స్ లవ్ విడుదలయ్యే నాటికి ఈ రెండు సినిమాల షూటింగులు బానే జరిగాయి. ఈ నేపథ్యంలో ఆమెను తీయలేని పరిస్థితి. ఆర్డీఎక్స్ లవ్ అనే సినిమా ద్వారా ఆమె ఎంతో నెగటివిటీని సాధించింది. పాయల్ కు ఆరెక్స్ 100 ద్వారా వచ్చిన పేరు మొత్తం ఈ సినిమాతో తుడిచిపెట్టుకుని పోయింది. ఈ రెండు సినిమాలకు పాయల్ కు ఒకలాంటి ఇమేజ్ వచ్చేసింది కాబట్టి ఆమెను హైలైట్ చేయడానికి మిగతా సినిమా వాళ్ళు భయపడుతున్నారు.

వెంకీ మామనే తీసుకుంటే.. ఇందులో ఆమె వెంకటేష్ సరసన నటించింది. కానీ వెంకీ మామకు సంబంధించిన ఏ ఈవెంట్ లో కూడా ఆమె ప్రాధాన్యత ఉండట్లేదు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో కూడా ఆమెను ఇన్వైట్ కూడా చేయలేదట. ఎందుకంటే పిలిస్తే ఫంక్షన్ కు రాలేనంత బిజీగా అయితే లేదు పాయల్. దీంతో కావాలనే వెంకీ మామ టీమ్ ఆమెను దూరం పెడుతున్నారని తెలుస్తోంది. కేవలం రాశి ఖన్నానే హైలైట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఒక్క సినిమా పాయల్ కు ఎంత చేటు చేసిందోనని ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు.

వెంకీ మామ డిసెంబర్ 13న విడుదల కానుండగా, పాయల్ చేతిలో ఇక డిస్కో రాజా సినిమా ఒకటే ఉంది. అది కూడా జనవరి చివరి వారంలో విడుదల కానుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితేనే పాయల్ కు మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. లేదంటే ఆమెకు వచ్చేవి ఒకేలాంటి సినిమాలు. అవి ఎలాంటివో మళ్ళీ చెప్పాల్సిన పనిలేదుగా.