అనంత‌పురంలో మొద‌లెట్టేశారు!


అనంత‌పురంలో మొద‌లెట్టేశారు!
అనంత‌పురంలో మొద‌లెట్టేశారు!

తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్ చేసిన‌న్ని రీమేక్‌లు బ‌హుషా ఏ హీరో చేయ‌లేదేమో. త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సూప‌ర్‌హిట్‌లుగా నిలిచిన చిత్రాల్ని తెలుగులో రీమేక్ చేసి హిట్‌ల‌ని సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న మ‌రో రీమేక్ `అసుర‌న్‌`. ధ‌నుష్ హీరోగా కుల వ్య‌వ‌స్థ నేప‌థ్యంలో రూపొందిన ఈ చిత్రం త‌మిళంలో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

ఇదే చిత్రాన్ని `నార‌ప్ప‌` పేరుతో రీమేక్ చేస్తున్నారు. విక్ట‌రీ వెంక‌టేష్ వ‌య‌సు మ‌ళ్లిన వ్య‌క్తిగా, యువ‌కుడిగా రెండు భిన్న‌మైన పార్శ్వాల్లో సాగే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ప్రియ‌మ‌ణి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, వి. క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై డి. సురేష్‌బాబు, క‌లైపులి ఎస్ ధాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయ‌ల‌సీమ‌లోని అనంత‌పురం నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అనంత‌పురంలో పొలాల మ‌ధ్య‌ చిత్ర బృందం బుధ‌వారం లాంఛ‌నంగా ప్రారంభించింది.

వెంక‌టేష్ 74వ చిత్రం కావ‌డంతో ఈ చిత్రం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. మంగ‌ళ‌వారం రాత్రి రిలీజ్ చేసిన ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తున్నారు. రా కంటెంట్‌తో రూపొందుతున్న సినిమా కావ‌డంతో అనంత‌పురంలోని రా లొకేష‌న్‌ల‌లో కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు. అక్క‌డే సినిమాకు సంబంధించిన కీల‌క షెడ్యూల్‌ని పూర్తిచేస్తార‌ట‌. గ‌త కొంత కాలంగా వ‌రుస ఫ్లాపులతో స‌త‌మ‌త‌మ‌వుతున్నద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల‌కు ఈ సినిమా ఓ ప‌రీక్షే అని చెప్పాలి.
మ‌ణిశ‌ర్మ సంగీతం, శ్యామ్ కె. నాయుడు ఫొటోగ్ర‌ఫీ, మార్తాండ్ కె. వెంక‌టేష్ ఎడిటింగ్, పీట‌ర్ హెయిన్స్ ఫైట్స్ అందిస్తున్నఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేసి స‌మ్మ‌ర్‌కు రిలీజ్ చేయాల‌న్న‌ది చిత్ర వ‌ర్గాల ప్లాన్‌గా తెలుస్తోంది.

Credit: Twitter