ధ‌నుష్‌కి వార్నింగ్ ఇచ్చిన వెట‌ర‌న్ డైరెక్ట‌ర్‌!


Vetatan director visu Warned Dhanush
Vetatan director visu Warned Dhanush

`నేట్రిక్క‌న్‌`.. ర‌జ‌నీకాంత్ నటించిన ఈ చిత్రం 1981లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. ఎస్‌.పి. ముత్తురామ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌జ‌నీ ద్విపాత్రాభిన‌యం చేశారు. స‌రిత‌, మేన‌క హీరోయిన్‌లుగా న‌టించిన ఈ చిత్రానికి క‌థ విసు, స్క్రీన్‌ప్లేని కె. బాలచంద‌ర్ అందించారు. ఇళ‌య‌రాజా సంగీతం అందించిన ఈ సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఈ చిత్రాన్ని త్వ‌ర‌లో ధ‌నుష్ రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు.

ఈ విష‌యం తెలిసిన వెట‌ర‌న్ ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, న‌టుడు విసు హీరో ధ‌నుష్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ చిత్ర క‌థ‌కు స‌బంధించిన రీమేక్ రైట్స్ నిర్మాణ సంస్థ క‌వితాల‌య పిక్చర్స్ వ‌ద్ద లేవ‌ని, త‌న అనుమ‌తి తీసుకునే రీమేక్ హ‌క్కులు ఇవ్వాల్సి వుంద‌ని, అలా కాకుండా ధ‌నుష్ ఈ చిత్రాన్ని రీమేక్ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తే లీగ‌ల్‌గా చ‌ర్య‌లు తీసుకోవాల్సి వుంటుంద‌ని మీడియా ముఖంగా హెచ్చ‌రించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

ధ‌నుష్ ఈ వార్త‌ల‌పై స్పందించ‌డానికి అందుబాటులో లేడు. `క‌ర్ణ‌న్‌` చిత్ర షూటింగ్‌లో బిజీగా వున్నారు. మారి సెల్వ‌రాజ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. `అసుర‌న్` త‌రువాత ధ‌నుష్ ఊర మాస్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న చిత్ర‌మిది. ఇటీవ‌లే ఈ చిత్ర షూటింగ్ కొండ‌రాళ్ల మ‌ధ్య మొద‌లైంది. సెట్‌లో క‌త్తిప‌ట్టుకుని నిలబ‌డిన ధ‌నుష్ లుక్ సోష‌ల్ మీడియా ద్వారా బ‌య‌టికి వ‌చ్చింది.