రౌడీ దేవరకొండ ఎమోషనల్ అయ్యాడే!


రౌడీ దేవరకొండ ఎమోషనల్ అయ్యాడే!
రౌడీ దేవరకొండ ఎమోషనల్ అయ్యాడే!

హీరోగా విజయ్ దేవరకొండ అనతికాలంలోనే తనదైన శైలిలో ఎదిగి మంచి మార్కెట్ ను ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా అంటే ఈజీగా 20 కోట్ల బిజినెస్ అవుతుంది. పెళ్లి చూపులు చిత్రంతో మొదటి హిట్ ను అందుకున్న విజయ్, అర్జున్ రెడ్డితో అందరి దృష్టిని ఆకర్షించి, గీత గోవిందంతో బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించాడు. ఇప్పుడు విజయ్ నటిస్తున్న, నటించాల్సిన చిత్రాలు మూడు వివిధ దశల ప్రీ ప్రొడక్షన్ ఫేజ్ లో ఉన్నాయి. మరోవైపు రౌడీ అనే ఫ్యాషన్ బ్రాండ్ వేర్ ను స్థాపించి బిజినెస్ రంగంలోకి కూడా దిగాడు. హీరోగా ఒకవైపు ఎదుగుతున్న విజయ్ ఆటిట్యూడ్ పరంగా విభిన్నమైన శైలిలో కనిపిస్తాడు. స్టేజ్ ఎక్కడంటే తనదైన శైలిలో జనాల్ని ఎంటర్టైన్ చేయడం అతని అలవాటు. రొటీన్ కు కొంచెం విభిన్నంగా స్టేజ్ మీద బిహేవ్ చేసే విజయ్ దేవరకొండ ఇప్పుడు నిర్మాతగా మారిన విషయం తెల్సిందే.

విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి చేసిన తొలి చిత్రం మీకు మాత్రమే చెప్తా. తనతో పెళ్లి చూపులు సినిమాను తెరకెక్కించిన తరుణ్ భాస్కర్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కింది. మీకు మాత్రమే చెప్తాతో షామీర్ అనే నూతన దర్శకుడ్ని పరిచయం చేస్తున్నాడు. నవంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది. నిన్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగగా విజయ్ దేవరకొండ చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. ఎప్పుడూ తన అభిమానుల్ని అలరిస్తూ మాట్లాడే విజయ్ ఈసారి వారిని ఎమోషనల్ చేసేసాడు. హీరో కాకముందు టీవీలలో నటీనటులు, సాంకేతిక నిపుణులను చూస్తుంటే వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని ఆలోచించేవాడినని, మనం వాళ్ళలా ఎప్పుడు అవుతాం అని అనుకునేవాడినని చెప్పాడు. అయితే సినిమా అవకాశాల కోసం చూస్తున్న తనకు నాగ్ అశ్విన్ పిలిచి ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాలో అవకాశం ఇచ్చాడని, అది మంచి పాత్ర అయినా కూడా ఏడాది పాటు ఖాళీగానే గడిపినట్లు చెప్పుకొచ్చాడు. ఆ సమయంలోనే పెళ్లి చూపులు సినిమా పట్టాలెక్కిందని, నిర్మాత చూస్తుంటే రాజ్ కందుకూరి ముందుకు వచ్చాడు, సినిమా ఎలా రిలీజ్ చేయాలా అనుకుంటుంటే సురేష్ బాబు ముందుకొచ్చారు. సందీప్ రెడ్డి అయితే అర్జున్ రెడ్డి సినిమా కోసం వరంగల్ లో తన ఇంటిని తాకట్టు పెట్టి మరీ సినిమా తీసాడు. గీత గోవిందం సినిమాతో పరశురామ్ తనకు మరిచిపోలేని హిట్ ఇచ్చాడు. ఇలా అందరూ తలో చేయి వేసి తనకంటూ ఒక ఇమేజ్ ను తీసుకొచ్చారని, తన కలని నిజం చేసారని, తను కూడా పది మంది కలల్ని నిజం చేయడం కోసం నిర్మాతగా మారానని అన్నాడు.

మీకు మాత్రమే చెప్తా సినిమా ద్వారా కొంత మంది కలల్ని నెరవేర్చాననే అనుకుంటున్నానని అన్నాడు. ఎప్పుడూ సరదాగా మాట్లాడే విజయ్ దేవరకొండ నుండి ఇలాంటి ఎమోషనల్ స్పీచ్ ఎవరూ ఊహించలేదు. హీరోగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరల్డ్స్ ఫేమస్ లవర్, హీరో, పూరి జగన్నాథ్ తో సినిమాను లైన్లో పెట్టాడు.