విజయ్-పూరి మధ్యలో ఇంద్రగంటికి ఏం పని?

విజయ్-పూరి మధ్యలో ఇంద్రగంటికి ఏం పని?
విజయ్-పూరి మధ్యలో ఇంద్రగంటికి ఏం పని?

హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ఆసక్తికర సినిమాలను లైన్లో పెడుతున్నాడు విజయ్ దేవరకొండ. డియర్ కామ్రేడ్ విఫలమైనా కానీ విజయ్ దేవరకొండకు అవకాశాలు ఏం తగ్గట్లేదు. ఇప్పటికిప్పుడు చేతిలో నాలుగు చిత్రాలు విజయ్ వి సిద్ధంగా ఉన్నాయి. మరో ఇద్దరు దర్శకులు వెయిటింగ్ లో ఉన్నారు. వచ్చే ఏడాది అంతా విజయ్ ఫుల్ బిజీగా ఉండనున్నాడు. అయితే చేతిలో ఎన్ని సినిమాలున్నా కొత్తగా దర్శకులు వచ్చి తనకు కథ చెబుతుంటే నచ్చితే ఓకే చేసేస్తున్నాడు. అది ఎప్పుడు చేయాలి తన దగ్గర డేట్స్ ఉన్నాయా లేవా అన్నది పెద్దగా లెక్క చెయ్యట్లేదు. ఇప్పటికే ఫుల్ బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ తాజాగా మరో సినిమాను ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజెస్ లో ఉంది. లెక్క ప్రకారమైతే ఈ సినిమా పూర్తవ్వగానే విజయ్ పూరి జగన్నాథ్ తో సినిమా చేయాల్సి ఉంది. వరస ప్లాపుల్లో ఉన్న పూరి జగన్నాథ్ ఇటీవలే ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ సక్సెస్ కొట్టి మంచి ఊపుమీదున్నాడు. విజయ్ తో ప్రాజెక్ట్ గురించి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఆ సినిమాకు ఫైటర్ అన్న టైటిల్ కూడా ఫిక్స్ చేసాడు. స్క్రిప్ట్ పనులు కూడా ఓ కొలిక్క వచ్చేసాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుండి సినిమా సెట్స్ పైకి వెళుతుందని ఆశిస్తున్న సమయంలో ఇప్పుడు ఒక ట్విస్ట్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఇటీవలే మోహన్ కృష్ణ ఇంద్రగంటి, విజయ్ దేవరకొండను కలిసి ఒక స్క్రిప్ట్ ను నరేట్ చేసాడట. చాలా కాన్ఫిడెంట్ గా ఫుల్ స్క్రిప్ట్ తో రావడంతో విజయ్ ఫ్లాట్ అయిపోయినట్లు తెలుస్తోంది. పైగా స్క్రిప్ట్ కూడా చాలా బాగుందని తన సన్నిహితులకు చెప్పాడట. అయితే వరస కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమాను ఎప్పుడు చేయాలా అన్న డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. పూరి సినిమాను వెనక్కి తోసి ఈ సినిమాను ముందు పట్టాలెక్కిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా విజయ్ కు ఉందిట.

మోహన్ కృష్ణ ఇంద్రగంటి ప్రస్తుతం నాని, సుధీర్ బాబులతో V సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది ఉగాది సందర్భంగా ఈ సినిమా విడుదలవుతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. V షూటింగ్ ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో జనవరి నుండి విజయ్ తో సినిమా షూటింగ్ ను మొదలుపెట్టేయాలని ఇంద్రగంటి భావిస్తున్నాడు. మరి పూరి, ఇంద్రగంటిలలో ఏ ప్రాజెక్ట్ ముందు పట్టాలెక్కుతుంది అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

అన్నట్లు విజయ్ దేవరకొండకి మరో రెండు చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఇప్పటికే విజయ్ షూటింగ్ మొదలుపెట్టిన హీరో, కొన్ని కారణాల వల్ల ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని ఆగిపోయింది. దాన్ని మొదలుపెట్టాలి. అలాగే శివ నిర్వాణ చెప్పిన కథకు కూడా ఎస్ చెప్పాడు విజయ్.