వెబ్ సిరీస్ కోసం `అర్జున్‌రెడ్డి` కాంబినేష‌న్?


వెబ్ సిరీస్ కోసం `అర్జున్‌రెడ్డి` కాంబినేష‌న్?
వెబ్ సిరీస్ కోసం `అర్జున్‌రెడ్డి` కాంబినేష‌న్?

టాలీవుడ్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ `అర్జున్‌రెడ్డి`. తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో కొత్త ఒర‌వ‌డికి నాంది ప‌లికిన ఈ చిత్రం ఇత‌ర భాష‌ల్లోనూ రీమేక్ అయి సంచ‌లం సృష్టించింది. ఈ చిత్రాన్ని హిందీలో `క‌బీర్‌సింగ్‌` పేరుతో రీమేక్ చేసి అక్క‌డా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలో హీరో షాహీద్ క‌పూర్ మార్కెట్‌ని, స్టార్‌డ‌మ్‌ని ఆకాశానికి ఎత్తేశారు. ఈ చిత్రంతో టాలీవుడ్‌తో పాటు ఉత్త‌రాదిన కూడా సంచ‌ల‌నం సృష్టించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్ వంగా మ‌ళ్లీ క‌ల‌వ‌బోతున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

అయితే అది సినిమా కోసం కాద‌ని ఓ వెబ్ సిరీస్ కోస‌మ‌ని తెలిసింది. సందీప్‌రెడ్డి వంగ‌, విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి ఓ వెబ్ సిరీస్‌ని నిర్మించ‌బోతున్నార‌ట‌. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ న‌టించనున్నాడ‌ని తాజా న్యూస్‌. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ న్యూస్ త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

సందీప్‌రెడ్డి వంగా `క‌బీర్‌సింగ్‌` త‌రువాత ప్ర‌భాస్ హీరోగా `డెవిల్‌` చిత్రాన్ని తెర‌కెక్కించాల‌ని ప్లాన్ చేశారు. కానీ ఆ ప్లాన్ వ‌ర్క‌వుట్ కాలేదు. అత‌న్ని ప‌క్క‌న పెట్టిన ప్ర‌భాస్ వ‌రుస‌గా ఇప్ప‌టికే రెండు చిత్రాల్ని ప్ర‌కటించిన విష‌యం తెలిసిందే. ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ చిత్రం తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిపిన షూటింగ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 40 శాతం చిత్రీక‌రణ పూర్త‌యింది.