పవర్ స్టార్ ను చూసి మన హీరోలు ఎంతైనా నేర్చుకోవచ్చు

పవర్ స్టార్ ను చూసి మన హీరోలు ఎంతైనా నేర్చుకోవచ్చు
పవర్ స్టార్ ను చూసి మన హీరోలు ఎంతైనా నేర్చుకోవచ్చు

ఇక్కడ పవర్ స్టార్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదు, తమిళులకు పవర్ స్టార్ ఇళయదళపతి విజయ్ గురించి. ఈ హీరో ఇప్పుడు మంచి ఊపు మీదున్నాడు. యావరేజ్ సినిమా చేసినా కానీ అవి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. యావరేజ్ కంటెంట్ తోనే 100 కోట్లు పైన వసూళ్లు సాధించగల సత్తా ఇప్పుడు విజయ్ సొంతం. పైగా వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో విజయ్ ఊపును ఆపేవాళ్లు దరిదాపుల్లో కూడా లేరంటే అతిశయోక్తి కాదు. ఇంత ఫుల్ ఫామ్ లో ఉన్న విజయ్ చేసే సినిమాల విషయంలో కూడా అంతే స్పీడుమీదున్నాడు. ఇప్పటికీ ఏడాదికి రెండు సినిమాలు అందించగలడు విజయ్. అసలు తీరిక అన్నదే లేకుండా ఒకటి తర్వాతి ఒకటిగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కథల గురించి దర్శకులను నెలల తరబడి వెయిట్ చేయించడమే విజయ్ కు అసలే తెలీదు.

ఈ మధ్యనే బిగిల్ చిత్రంతో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు విజయ్. ఈ చిత్రానికి యావరేజ్ రేటింగులే వచ్చాయి. కేవలం విజయ్ ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా అన్నారు. అయినా కానీ బిగిల్ బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. బిగిల్ అంత పెద్ద హిట్టయినా విజయ్ ఏం బ్రేక్ తీసుకోవట్లేదు. వచ్చే ఏడాదికి రెండు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఒకటి సమ్మర్ కు వస్తుందని తెలుస్తోంది. రెండో సినిమా దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా హిట్ కొట్టడమే కాకుండా ఫాస్ట్ గా సినిమాలు చేయడం తమిళ ఇండస్ట్రీకి కూడా బాగా కలిసొస్తుందని అంటున్నారు.

ఇప్పుడు విజయ్ ను ఉదాహరణగా చూపించి తెలుగు హీరోలను కామెంట్ చేస్తున్నారు కొంతమంది. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఒక కథను ఓకే చేయాలంటే దర్శకులు నెలల తరబడి వెయిట్ చేయాల్సిందే. పైగా అప్పటికైనా చేస్తారన్న నమ్మకం లేదు. సుకుమార్ ఈ విధంగా బుక్కై సంవత్సరం పైన వేస్ట్ చేసుకున్నాడు. పైగా సినిమా, సినిమాకి మన తెలుగు టాప్ స్టార్స్ ఎక్కువ గ్యాప్ కూడా తీసుకుంటారు. సంవత్సరానికి ఒక్క సినిమా చేయడానికి కూడా వీళ్లకు కష్టమైపోతోంది. క్వాలిటీ కోసం ఎక్కువ ఆలోచించి మనవాళ్ళు పూర్తిగా నెమ్మదిస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దాన్నుండి మన హీరోలు ఎప్పటికి బయటకి వస్తారో చూడాలి.