రోజా కాదంటే విజయశాంతి ఉందిగా అంటున్నారే?Vijayashanti to be considered for Balayya - Boyapati film
Vijayashanti to be considered for Balayya – Boyapati film

బోయపాటి శ్రీను.. కమర్షియల్ దర్శకుడిగా టాప్ స్థాయికి ఎదిగిన దర్శకుడు. కమర్షియల్ అంశాలను సరైన మోతాదులో నింపి సినిమాలను తెరకెక్కించడంలో బోయపాటి సిద్ధహస్తుడు. అయితే తన బలమే, బోయపాటి శ్రీనుకి బలహీనతగా మారింది. వరసగా ఒకేలాంటి మూస కథలను తెరకెక్కించడంతో బోయపాటిపై నెగటివిటీ కూడా మొదలైంది. రామ్ చరణ్ హీరోగా బోయపాటి తెరకెక్కించిన వినయ విధేయ రామ ఎలాంటి ఫలితాన్ని అందుకుందో అందరం చూసాము. ఈ సినిమాపై, ముఖ్యంగా బోయపాటిపై వచ్చినన్ని ట్రోల్స్ మరే సినిమాపై రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తన తర్వాతి సినిమా విషయంలో బోయపాటి శ్రీను చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కొన్ని నెలల క్రితమే నందమూరి బాలకృష్ణతో తన తర్వాతి సినిమాను కన్ఫర్మ్ చేసుకున్న శ్రీను ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై పోయి ఉన్నాడు. బోయపాటి శ్రీను తన సినిమాల్లో అనుసరించే మరో.అంశం. క్యారెక్టర్ పాత్రలకు పేరున్న నటులను ఎంచుకోవడం. ఆ నటుడి ఎంపికతోనే సినిమాకు హైప్ తీసుకురావడం. బోయపాటి శ్రీను తెరకెక్కించిన సినిమాలను చూస్తే మనకు ఆ విషయం అర్ధమైపోతుంది.

లెజండ్ సినిమాకు జగపతి బాబును విలన్ గా ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. సరైనోడు చిత్రానికి ఆదిని విలన్ గా, ముఖ్యమైన పాత్రకు శ్రీకాంత్ ను ఎంచుకున్నాడు. జయ జానకి నాయకి సినిమాలో శరత్ కుమార్ ఎంపిక ఇలా జరిగిందే. వినయ విధేయ రామలో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహలను ఇలానే తీసుకున్నాడు కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఈసారి బోయపాటి మరో సారి క్యారెక్టర్ రోల్ కోసం స్పెషల్ నటి కోసం అన్వేషిస్తున్నాడు. మొదటగా రోజాను ఆ రోల్ కోసం తీసుకుందామని అనుకుంటున్నట్లు తెలిసింది. బాలకృష్ణ, రోజా కాంబినేషన్ అంటే దానికొచ్చే హైప్ వేరుగా ఉంటుంది. ఒకప్పుడు హీరో, హీరోయిన్లుగా ఎన్నో హిట్లు కొట్టిన ఈ ఇద్దరూ, తర్వాత రాజకీయ ప్రత్యర్థులుగా ఒకరిపై మరొకరు విమర్శలు కూడా చేసుకున్నారు. అందుకే బాలకృష్ణ సినిమాలో విలన్ పాత్రకు రోజాను ఒప్పించాలని బోయాపాటి ప్రయత్నించాడు.

అయితే రోజా ఇప్పుడు చాలా బిజీగా ఉంటోంది. నగరి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజా, ఏపీఐఐసీ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే జబర్దస్త్ ప్రోగ్రాంకు జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో తాను ప్రస్తుతం సినిమాలు చేయలేనని చెబుతోంది. ఇక ఇప్పుడు రోజా నో చెప్పేయడంతో బోయపాటి ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తున్నాడు. తర్వాత బెస్ట్ ఆప్షన్ గా ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోన్న విజయశాంతి మదిలో మెదిలింది. మహేష్ బాబుతో నటిస్తోన్న సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెల్సిందే. ఇటీవలే టీజర్ లో కూడా ఆమె కనిపించింది. ఆమెకు బాగా ప్రాధాన్యమున్న పాత్రే దక్కినట్లు తెలుస్తోంది. సరైన పాత్రలు వస్తే సినిమాల్లో కొనసాగడానికి తనకేం అభ్యంతరం లేదని విజయశాంతి ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో బోయపాటి ఆమెను సంప్రదించాలని అనుకుంటున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.