పెద్దాయన కోరికను కంగనా తీరుస్తుందా?

పెద్దాయన కోరికను కంగనా తీరుస్తుందా?
పెద్దాయన కోరికను కంగనా తీరుస్తుందా?

రచయితగా విజయేంద్ర ప్రసాద్ స్థాయి గురించి చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కొడుకు రాజమౌళి సినిమాలకు రచన చేసినప్పటినుండి ఎక్కువ లైమ్ లైట్ లోకి వచ్చాడు కానీ విజయేంద్ర ప్రసాద్ అప్పటికే టాలీవుడ్ లో పేరున్న రచయిత. అయితే విజయేంద్ర ప్రసాద్ అందించిన కథలను తనదైన శైలిలో రాజమౌళి తీర్చిదిద్దడం, దానికి నయా కమర్షియల్ ఫార్ములాను అద్దడంతో ఆయన కథలు మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువైంది. రాజమౌళి తెరకెక్కించే ప్రతీ సినిమా వెనుకా ఐడియా విజయేంద్ర ప్రసాద్ దే ఉంటుంది. అంతే కాకుండా రాజమౌళి సినిమా పని జరుగుతున్నంత సేపూ విజయేంద్ర ప్రసాద్ దృష్టి అక్కడే ఉంటుంది. సినిమా మేకింగ్ లో కూడా ఐడియాలు ఇస్తుంటారు విజయేంద్ర ప్రసాద్. అంతలా విజయేంద్ర ప్రసాద్ – రాజమౌళి కాంబో పనిచేస్తుంది. అందుకే కథపై, ఆ ఎమోషన్ పై ఇద్దరికీ ఆ పట్టు ఉంటుంది.

బాహుబలి సిరీస్ కు కూడా విజయేంద్ర ప్రసాద్ మూల కథ అందించాడు. చాలా క్రితమే రాజమౌళికి ఈ కథను చెప్పగా దాన్ని తెరమీదకు తీసుకురావడానికి రాజమౌళికి కూడా చాలా సమయం పట్టింది. ప్రస్తుతం రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. దీనికి కూడా కథ అందించింది విజయేంద్ర ప్రసాద్. పీరియాడిక్ కథకు తనదైన ఫిక్షనల్ అంశాలను జోడించి ఈ కథను సిద్ధం చేసాడు. దానికి రాజమౌళి తన శైలిలో విజువలైజ్ చేసుకుని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా హైదరాబాద్ లోనే సాగుతోంది. అయితే విజయేంద్ర ప్రసాద్ మాత్రం హైదరాబాద్ లో లేడు. ముంబైలో కంగనా సినిమా వ్యవహారాలలో తన మునకలై ఉన్నాడు. కంగనా చిత్రాలకి రైటింగ్ టీమ్ హెడ్ గా వ్యవహరిస్తున్నాడు విజయేంద్ర ప్రసాద్.

మణికర్ణిక సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథ అందించాడు. నిజానికి క్రిష్ తో కంగనాకు వివాదం జరిగినప్పుడు ఆమెనే డైరెక్ట్ చేయమని విజయేంద్ర ప్రసాద్ ప్రోత్సాహం అందించాడు. అంతటి పెద్దాయన తనను నమ్మడంతో కంగనాకు కూడా ధైర్యం వచ్చి ముందడుగు వేసింది. దీంతో కంగనాకు పెద్దాయన మీద అభిమానం ఏర్పడి, తన సినిమాలకు పనిచేయమని అడిగింది. ప్రస్తుతం కంగనా బయోపిక్ ను రాసే పనిలో నిమగ్నమై ఉన్న విజయేంద్ర ప్రసాద్ తెలుగు సినిమాలపై అంత ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది.

విజయేంద్ర ప్రసాద్ కు ఎప్పటినుండో దర్శకత్వం చేయాలనే కోరిక ఉంది. అయితే అప్పట్లో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మొత్తానికి రాజమౌళి వల్ల క్రేజ్ రావడంతో విజయేంద్ర ప్రసాద్ కు రాజన్న అవకాశం వచ్చింది. దాని తర్వాత తాను దర్శకత్వంపై వర్కౌట్ చేయలేదో లేక అవకాశం రాలేదో కానీ విజయేంద్ర ప్రసాద్ మరో సినిమాను తెరకెక్కించలేదు. కంగనా దగ్గర ఉంటే ఏదొక రోజు డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందని అక్కడే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మరి పెద్దాయన కోరికను కంగనా తీరుస్తుందా?