విశాల్‌కు మ‌ళ్లీ షాకిచ్చిన మ‌ద్రాస్ హైకోర్ట్‌!

Vishal Chakra facing leagal trouble in once again
Vishal Chakra facing leagal trouble in once again

హీరో విశాల్‌కు మ‌రోసారి మ‌ద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. త‌ను న‌టిస్తున్న తాజా చిత్రం విడుద‌ల విష‌యంలో స్టేవిధిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో విశాల్ న‌టిస్తున్న సైబ‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్ `చ‌క్ర‌` రిలీజ్ వివాదంలో ప‌డింది. ఈ మూవీ నిర్మాణ హ‌క్కులు త‌న‌వే అంటూ నిర్మాత ర‌వీంద్ర‌న్ హైకోర్టుని ఆశ్ర‌యించారు. దీంతో ఈ చిత్ర రిలీజ్‌పై కోర్టు స్టేని విధించింది.

గ‌తంలో ట్రిడెంట్ ఆర్ట్స్ అధినేత ర‌వీంద్ర‌న్ హీరో విశాల్‌తో `యాక్ష‌న్‌` చిత్రాన్ని నిర్మించారు. భారీ న‌ష్టాల‌ని చ‌విచూడ‌టంతో త‌దుప‌రి చిత్రాన్ని త‌న‌కే చేస్తాన‌ని విశాల్ మాటిచ్చార‌ట‌. అందుకు సంబంధించి అగ్రిమెంట్ కూడా చేసుకున్నార‌ట‌. అయితే దాన్ని అతిక్ర‌మించి తానే నిర్మాత‌గా `చ‌క్ర‌` చిత్రాన్ని నిర్మించారు విశాల్‌. ఇక్క‌డే వివాదం మొద‌లైంది.

త‌న‌కు చేస్తాన‌న్న చిత్రాన్ని సొంత సంస్థ‌లో చేసుకోవ‌డం నిర్మాత రవీంద్ర‌న్‌కి ఆగ్ర‌హాన్ని తెప్పించింద‌ట‌. దీంతో మ‌ద్రాస్ హైకోర్టుని ఈ మూవీ క‌థ హ‌క్కుల విష‌యంలో సంప్ర‌దిస్తే కోర్టు `చ‌క్ర‌` రిలీజ్‌పై స్టేని విధించ‌డం సంచ‌ల‌నంగా మారింది. 19న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని విశాల్ ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా కోర్టు 18కి కేసుని వాయిదా వేయ‌డంతో విశాల్ లో టెన్ష‌న్ మొద‌లైంద‌ని చెబుతున్నారు.