నాగబాబు విషయంలో జబర్దస్త్ దే తప్పుందా?

నాగబాబు విషయంలో జబర్దస్త్ దే తప్పుందా?
నాగబాబు విషయంలో జబర్దస్త్ దే తప్పుందా?

జబర్దస్త్ – నాగబాబు వ్యవహారం గత కొన్నాళ్ల నుండి బాగా హైలైట్ అవుతోంది. ఎక్కడ చూసినా ఇదే న్యూస్. జనాలు కూడా దీని గురించే ఎక్కువ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే జబర్దస్త్ తో నాగబాబు రిలేషన్ ఈనాటిది కాదు. దాదాపుగా ఏడున్నరేళ్లుగా జబర్దస్త్ ను అంటిపెట్టుకుని ఉన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు కాపు కాసాడు. తానే కష్టాల్లో ఉన్నప్పుడు జబర్దస్త్ సహాయపడడంతో నాగబాబు ఈ షో పట్ల చాలా కృతజ్ఞతగా ఉంటున్నాడు. ఒకానొక టైమ్ లో జబర్దస్త్ ద్వారా వచ్చిన డబ్బుతోనే తాను ఫ్యామిలీని నడిపినట్లు నాగబాబు చాలా ఓపెన్ గా మాట్లాడుతుంటాడు. అలాంటి అనుబంధం ఉన్న నాగబాబు సడెన్ గా బయటకు వచ్చేయడంతో ప్రేక్షకులకు ఏం అర్ధం కాలేదు. దీనిపై కారణాలు ఏముంటాయా అన్న ఆరాలు తీశారు కానీ వాటి వల్ల పెద్ద ఉపయోగం లేదు. పోనీ నాగబాబు ఏదైనా చెప్తాడా అంటే అతను కారణాలు చెబుతానని చెప్పి మొదటి నుండి తన జబర్దస్త్ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నాడు. దాన్ని ఒక సిరీస్ లా ప్లాన్ చేసాడు నాగబాబు. అయితే ఇప్పటిదాకా చెప్పినదాన్ని బట్టి చూస్తే నాగబాబు జబర్దస్త్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడాడు. తనకు మరో లైఫ్ ఇచ్చిన శ్యామ్ ప్రసాద్ రెడ్డికి, ఈటివికి కృతఙ్ఞతలు చెప్పాడు వీడియోలో.

అయితే జబర్దస్త్ లో నాగబాబు పాల్గొన్న లాస్ట్ ఎపిసోడ్ శుక్రవారం టెలికాస్ట్ అయింది. ఇన్నేళ్ల అనుబంధం ఉన్న వ్యక్తి వెళ్లిపోతుంటే ఆయన్ను సత్కరించడం లాంటివేం చేయలేదు. అలాంటి ప్రోగ్రాం ఏదైనా ఈటివి, మల్లెమాల వాళ్ళు చేసుంటే చాలా హుందాగా ఉండేది అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. నాగబాబు కూడా ఈ విషయంలో అన్యమనస్కంగానే షో లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఎపిసోడ్ చివర్లో ఎప్పుడూ నవ్వులు చిందించే నాగబాబు ఈసారి గంభీరంగానే ఉన్నాడు. జడ్జిమెంట్ విషయంలో కూడా సీరియస్ గానే వ్యవహరించాడు. స్కిట్ల మధ్యలో పంచ్ వేయడం లాంటివేం చేయలేదు. ఒక పక్క రోజా నవ్వుతుంటే, నాగబాబు మొహంలో మాత్రం ఎలాంటి నవ్వూ లేదు. ఈ ఎపిసోడ్ లో కూడా నాగబాబుకు ఎక్కువ కట్ లు లేకుండా యాజమాన్యం జాగ్రత్తపడింది. యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసిన దగ్గర కూడా ఆయన థంబ్ నైల్ ఎక్కడా వేయలేదు. రోజాది మాత్రమే వేసి నాగబాబుది లైట్ తీసుకున్నారు. వారి మధ్య ఎలాంటి గొడవలున్నా ఈ విషయంలో ఈటీవీ, మల్లెమాల మరింత హుందాగా వ్యవహరించి ఉంటే బాగుండేది అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి.