ర‌క్ష‌కుడు ఎవ‌రు రాక్ష‌సుడు ఎవ‌రు?


Who is Rakshakudu, Rashasudu in V
Who is Rakshakudu, Rashasudu in V

నేచుర‌ల్ స్టార్ నాని `జెర్సీ` నుంచి త‌న పంథా మార్చుకున్నారు. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కు పూర్తి భిన్నంగా కొత్త త‌ర‌హా క‌థ‌ల‌ని ఎంచుకుంటున్నారు. ఈ సినిమా త‌రువాత ఆయ‌న న‌టించిన డార్క్ కామెడీ థ్రిల్ల‌ర్ `గ్యాంగ్‌లీడ‌ర్‌` ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో నెక్స్ట్ ఫిల్మ్‌ని మ‌రింత జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసుకుంటున్నారు. సుధీర్‌బాబుతో క‌లిసి నాని న‌టిస్తున్న తాజా చిత్రం `వి`. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్నఈ చిత్రానికి ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

నివేదా థామ‌స్‌, అదితీరావు హైద‌రీ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్‌, హ‌ర్షిత్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోగా మంచి రైజింగ్‌లో వున్న నాని త‌న‌ కెరీర్‌లో తొలిసారి ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. మెయిన్ హీరోగా సుధీర్‌బాబు న‌టిస్తున్న సినిమా అంతా నాని పాత్ర చుట్టూనే తిరుగుతుంద‌ట‌. పాత్ర కొత్త‌గా వుండ‌టంతో ఇందులో తొలిసారి రాక్ష‌సుడిని త‌ల‌పించే పాత్ర‌లో నాని క‌నిపించ‌బోతుండ‌టం సినీ ల‌వ‌ర్స్‌ని షాక్‌కు గురిచేస్తోంది.

ర‌క్ష‌కుడిగా సుధీర్‌బాబు, రాక్ష‌సుడిగా నాని క‌నిపించ‌బోతున్నారు. వీరికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ల‌ని చిత్ర బృందం వ‌రుస‌గా ఈ నెల 27న ర‌క్ష‌కుడి గెట‌ప్ లో సుధీర్‌బాబు లుక్‌ని, 28న రాక్ష‌సుడిగా నేచుర‌ల్‌స్టార్ నాని లుక్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. నాని గ‌త చిత్రాల‌కు మించి కొత్త పంథాలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మార్చి 25న ఉగాది కానుక‌గా రిలీజ్ చేయాల‌ని చిత్ర వ‌ర్గాలు ప్లాన్ చేస్తున్నాయి. జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌, వెన్నెల కిషోర్‌, నాజ‌ర్‌, ప్రియ‌ద‌ర్శి, అమిత్ తివారి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.