వెంకీ మామ రిలీజ్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?


వెంకీ మామ రిలీజ్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?
వెంకీ మామ రిలీజ్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఏంటి?

విక్టరీ వెంకటేష్ తొలిసారి తన మేనల్లుడు అక్కినేని నాగ చైతన్యతో కలిసి నటించిన చిత్రం వెంకీ మామ. ఇదివరకు ప్రేమమ్ లో వీళ్ళిద్దరూ ఒక స్క్రీన్ మీద కనిపించినా అది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే. ఇందులో ఇద్దరూ ఫుల్ లెంగ్త్ పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదలవ్వగా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అన్న ఫీల్ కలిగించగలిగింది. పవర్, జై లవకుశ సినిమాల దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇక అసలు విషయంలోకి వెళితే.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొని ఉంది. సురేష్ బాబు అంటే సరైన ప్లానింగ్ తో సరైన సమయంలో సినిమాను రిలీజ్ చేసి హిట్టు కొడతాడని టాక్. అయితే వెంకీ మామ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఎక్కడలేని కన్ఫ్యూజన్ నెలకొంది. దాంతో షూటింగ్ అప్డేట్ విషయమై కూడా క్లారిటీ లేదు. దీనివల్ల అటు డిస్ట్రిబ్యూటర్లు, ఇటు సాధారణ ప్రేక్షకులు కూడా అయోమయానికి గురయ్యారు.

మొదట ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా బరిలోకి దింపాలనుకున్నారు. 20, 21 తేదీల్లో కానీ 25న కానీ సినిమాను రిలీజ్ చేయాలని భావించారు. అయితే సడెన్ గా ఏమైందో వెంకీ మామ సంక్రాంతికి విడుదలవుతున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటికే నాలుగు చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ డేట్లను షెడ్యూల్ చేసుకున్నాయి. వెంకీ మామ ఐదవ చిత్రంగా జనవరి 14న లేక 11న విడుదలవుతుందని అన్నారు. ఈ మేరకు ప్రొడక్షన్ హౌజ్ నుండి అందరు డిస్ట్రిబ్యూటర్లకు వార్త వెళ్లిపోయింది కూడా. సర్లే ఏదోకటి సంక్రాంతికే చూసుకుందాం అనుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ కాదు కాదు డిసెంబర్ లోనే ఈ చిత్రం విడుదలవుతుంది కాకపోతే క్రిస్మస్ కు కాదు డిసెంబర్ 12న వెంకీ మామను రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు.

అసలు ఏంటీ కన్ఫ్యూజన్? ఎందుకని రిలీజ్ డేట్ ప్రకటించే విషయంలో ముందూ వెనకా అవుతోంది? సురేష్ బాబు మనసులో ఏముంది? వెంకీ మామ షూటింగ్ ఎంతవరకూ వచ్చింది? వెంకీ మామ షూటింగ్ దాదాపు అయిపోవచ్చింది. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. కాకపోతే నవంబర్ ఆఫ్ సీజన్ కాబట్టి అప్పుడు రిలీజ్ చేయాలనుకోవట్లేదు. ఇక క్రిస్మస్ రిలీజ్ లేదా సంక్రాంతి రిలీజ్ అనుకున్నా కూడా వెనక్కి తగ్గడానికి కారణం, మూవీ బడ్జెట్ అట. ఈ చిత్రానికి ఓవర్ బడ్జెట్ అయిందని తెలుస్తోంది. వెంకటేష్, నాగ చైతన్య వీరిద్దరి మార్కెట్ ను దాటేసి 40 కోట్ల దాకా ఖర్చుపెట్టేసాడు దర్శకుడు బాబీ. ఈ నేపథ్యంలో పండగల్లో రిలీజ్ చేసినా సోలో రిలీజ్ ఉండదు. మూడు, నాలుగు సినిమాల మధ్య రిలీజ్ చేయాలి. దానికన్నా సోలో రిలీజ్ కు వెళ్తే బెటర్ అనుకున్నారు. అందుకే వెంకీ మామను డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు. మరి ఈ మూవ్ ఎంతవరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.