ఆ సెంటిమెంట్ ప్రకారం చూస్తే ప్రతిరోజూ పండగే బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం


ఆ సెంటిమెంట్ ప్రకారం చూస్తే ప్రతిరోజూ పండగే బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం
ఆ సెంటిమెంట్ ప్రకారం చూస్తే ప్రతిరోజూ పండగే బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం

మారుతికి మొదట్లో బూతు దర్శకుడిగా పేరుండేది. మొదట్లో మారుతి తెరకెక్కించిన చిత్రాలు ఈరోజుల్లో, బస్ స్టాప్ లు ఎక్కువగా ద్వంద్వార్ధాలు, యువతను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కడంతో మారుతికి ఆ పేరు వచ్చేసింది. దానికి తోడు అప్పట్లో మారుతి తెరకెక్కించిన సినిమాలు కూడా అలాగే ఉండేవి. దాంతో మారుతిని బూతు దర్శకుడు కేటగిరీలో వేసేసారు. అయితే భలే భలే మగాడివోయ్ సినిమాతో తన కెరీర్ ను పూర్తిగా మార్చేసుకున్నాడు మారుతి. అప్పట్లో నాని ఈ దర్శకుడితో జత కడితే బూతు దర్శకుడితో నానికేంటి పని అని బహిరంగంగానే కామెంట్లు చేసారు. అయితే మారుతి ఈ సినిమాతో తనపై ఇమేజ్ ను పూర్తిగా మార్చేసుకోగలిగాడు. భలే భలే మగాడివోయ్ లో ఒక్క ద్వంద్వార్థం లేకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా సినిమా తీసి తానేంటో నిరూపించాడు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందుకే మారుతి కెరీర్ ను భలే భలే కు ముందు, తర్వాత అని విభజించవచ్చు.

ఎందుకంటే ఆ సినిమాకు ముందు మారుతి తీసిన సినిమాలన్నీ హిట్టే. భలే భలే కూడా హిట్టవ్వడం, పైగా క్లీన్ ఎంటర్టైనర్ అందించగలడు అని పేరు రావడంతో మారుతి పేరు మార్మోగిపోయింది. అయితే అక్కడినుండి మారుతికి ఒక వింత సెంటిమెంట్ పట్టుకుంది. అదే ఒక సూపర్ హిట్ ఇవ్వగానే అంచనాల్ని అందుకోలేకపోవడం. భలే భలే మగాడివోయ్ తీసిన ఉత్సాహంతో బాబు బంగారం తీస్తే అది ఎలాంటి ఫలితాన్ని అందుకుందో చూసాం. అయితే బాబు బంగారం ప్లాప్ తర్వాత కసిగా మహానుభావుడు చేస్తే దానికి పట్టం కట్టారు ప్రేక్షకులు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా హిట్ అయిందని నాగ చైతన్యతో శైలజ రెడ్డి అల్లుడు తీస్తే అది తుస్సుమంది. అంటే అంచనాలను అందుకోవడంలో మారుతి ఫెయిల్ అవుతున్నాడు. ఒక హిట్ తర్వాత దాన్ని సస్టైన్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు. అలాగే ఒక ఫెయిల్యూర్ తర్వాత కసిగా హిట్ కొడుతున్నాడు.

ఇదే సెంటిమెంట్ ప్రకారం చూస్తే శైలజ రెడ్డి అల్లుడు ప్లాప్ కాబట్టి మారుతి తర్వాతి సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలి. సాయి ధరమ్ తేజ్ తో చేసిన ప్రతిరోజూ పండగే చిత్రానికి అన్నీ పాజిటివ్ గానే ఉన్నాయి. పాటలు, ట్రైలర్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. ఒక మంచి సినిమా అన్న ఫీల్ ను, ఒక కామెడీ ఎంటర్టైనర్ అన్న భావనను కలిగిస్తున్నాయి. మరి డిసెంబర్ 20న విడుదలయ్యే ఈ చిత్రం మారుతి సెంటిమెంట్ ను బలపరుస్తుందో లేదో చూడాలి.

సాయి ధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రావు రమేష్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. థమన్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మూడు పాటలు విడుదల చేయగా మూడూ కూడా హిట్ అయ్యాయి. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా త్వరలో నిర్వహించాలని భావిస్తున్నారు. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.