ఆ యువ హీరో సింపతీతో హిట్ కొట్టేస్తాడా?


Will sympathy factor work for Arjun Suravaram
Will sympathy factor work for Arjun Suravaram

టాలీవుడ్ లో సినిమా హిట్ అవ్వడానికి చాలా ఫ్యాక్టర్స్ కారణాలు కావొచ్చు. ఏ సినిమా హిట్ అవ్వడానికైనా కథ కీలకమైనా ఒక్కోసారి అదొక్కటి మాత్రమే సరిపోదు. సినిమా బాగున్నా ఆ హీరో మీద నెగటివ్ ఇంప్రెషన్ వస్తే ప్లాప్ అయిన సందర్భాలు కోకొల్లలు. అలాగే ఒక హీరో మీద సింపతీ వస్తే యావరేజ్ కంటెంట్ ఉన్నా సరే సూపర్ హిట్ కొట్టొచ్చు. ఈ మధ్య విజయ్ దేవరకొండ సినిమా టాక్సీవాలా సినిమాకు ఇలాగే సింపతీ ఫ్యాక్టర్ బాగా వర్కౌట్ అయింది. సినిమా రిలీజ్ కు రెండు నెలల ముందే సినిమా ఆన్లైన్ లో విడుదలైపోవడంతో చిత్ర యూనిట్ లబోదిబోమంది. ఇది ప్రేక్షకుల్లో బాగా సింపతీ వచ్చేలా చేసింది. దాంతో సినిమా పర్వాలేదు అనే టాక్ వచ్చినా కానీ అద్భుతమైన కలెక్షన్స్ తో సూపర్ హిట్ అందుకుంది. చూస్తుంటే ఇప్పుడు మరో హీరో ఇలాగే సింపతీ ఫ్యాక్టర్ తో హిట్ కొడతాడేమో అని అంటున్నారు విశ్లేషకులు.

ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు, గత కొంత కాలంగా సరైన హిట్ అన్నదే లేని నిఖిల్. సింపతీ వర్కౌట్ అవుతున్న ఆ సినిమా పేరు అర్జున్ సురవరం. నిజానికి ఈ సినిమా ఏడాది క్రితమే విడుదల కావాల్సి ఉంది. తమిళ హిట్ చిత్రం కనిదన్ కు రీమేక్ గా అర్జున్ సురవరం తెరకెక్కింది. ఫేక్ సర్టిఫికెట్ల కుంభకోణం నేపథ్యంలో, కాంటెంపరరీ సబ్జెక్ట్ తో ఈ చిత్రం రూపొందింది. అయితే ఏడాది క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల లెక్కలేనన్ని సార్లు వాయిదాల మీద వాయిదాలు పడి మొత్తానికి నవంబర్ 29న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈసారి కూడా రిలీజ్ డేట్ ప్రకటిస్తే చాలా మంది సందేహించారు. కానీ ఈ చిత్రానికి ఇప్పుడు చేస్తోన్న ప్రమోషన్స్, థియేట్రికల్ ట్రైలర్ సైతం విడుదల చేయడం వంటి కారణాల వల్ల ఈసారి రిలీజ్ పక్కా అనుకోవచ్చు.

సిన్సియర్ గా కష్టపడ్డా సరే నిఖిల్ కు ఇలా వాయిదాల రూపంలో కష్టాలు ఎదురవడంతో ఇప్పుడు ఈ సినిమా మీద సింపతీ వచ్చింది. బలమైన కంటెంట్ కూడా ఉన్న ఈ సినిమాకు ఈ సింపతీ ఫ్యాక్టర్ కూడా కలిస్తే నిఖిల్ హిట్ కొట్టడం ఖాయం. నిఖిల్ కూడా సోషల్ మాధ్యమాల్లో ఈ సినిమాకు తాము ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నది చెబుతున్నాడు. తన 17 సినిమాలకు దేనికీ అర్జున్ సురవరం కోసం పడినంత కష్టం పడలేదని చెబుతున్నాడు. మరి ఈ సెంటిమెంట్ తో నిఖిల్ హిట్ అందుకోగలడా అన్నది చూడాలి.

లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి సంతోష్ దర్శకత్వం వహించాడు. ఖైదీ చిత్రానికి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన శ్యామ్ సీఎస్ అర్జున్ సురవరంకు సంగీత దర్శకుడిగా పని చేసాడు. ఈ సినిమా రిజల్ట్ సంగతెలా ఉన్నా నిఖిల్ తన తర్వాతి సినిమా కార్తికేయ 2 షూటింగ్ కు సిద్ధమవుతున్నాడు.