బూతు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు

బూతు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు
బూతు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టారు

కష్టపడి మంచి కథ రాసుకోవడం, దానికి తగ్గట్లు తరగణాన్ని ఎంచుకోవడం, నిపుణులైన సాంకేతిక వర్గాన్ని సెట్ చేసుకోవడం.. చాలా జాగ్రత్తగా షూటింగ్ చేసుకోవడం.. తీరా రిలీజ్ అయ్యాక మంచి టాక్ వస్తుందా రాదా, బ్రేక్ ఈవెన్ అవుతుందా అవ్వదా అంటూ టెన్షన్ పడటం. ఒక మంచి సినిమా తీయాలంటే ఇవన్నీ ఉండాల్సిందేగా మరి. టాప్ హీరో చిత్రం నుండి లో బడ్జెట్ చిత్రం వరకూ భాషతో సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీలో సాగుతుంది వ్యవహారం. అయితే ఇదంతా సవ్యంగా సినిమాలు తీసే వాళ్లకు. ఇవేమి లేకుండా ఒక పద్దతిలో సినిమాలు తీసి కూడా హిట్ కొట్టొచ్చు అంటున్నారు కొంత మంది.

అదే బూతు కంటెంట్.. కథ అవసరం లేదు, విరగబడి నటించాల్సిన అవసరం అంతకన్నా లేదు, పబ్లిసిటీ కూడా చెమటలు చిందించి చేయాల్సిన పనిలేదు. నిపుణులైన సాంకేతిక వర్గం అవసరమే లేదు. ఒక చిన్న కాన్సెప్ట్ ను తీసుకుని దాన్నుండి ఇష్టమొచ్చినట్లు, తమకు తోచినట్లు బూతును తీసుకుంటూ వెళ్లిపోవడమే. ఇక చూడు నా సామి రంగా.. వసూళ్లే వసూళ్లు. వీలైనంత బూతు కంటెంట్ ను నింపితే కుదిరితే సెన్సార్ వాళ్ళు ఉంచుతారు లేదంటే లేదు. అంతకుముందే ఎలాగో ట్రైలర్ లో అలాంటి సీన్స్ అన్నీ పెట్టేయొచ్చు. ఎందుకంటే యూట్యూబ్ లో వీడియోస్ కు న్యూడిటీ తప్ప వేరే సెన్సార్ లేదు. ఎలాంటి బూతునైనా చూపించేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కాసులు రాల్చే మంత్రంగా బూతు సినిమా తయారవ్వడం నిజంగా టాలీవుడ్ లో విచారకరం.

ఉదాహరణకు రీసెంట్ గా విడుదలైన ఏడు చేపల కథనే తీసుకోండి. లిమిటెడ్ బడ్జెట్ లో తీసిన ఈ చిత్రం.. టీజర్ తోనే సంచలనం సృష్టించింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎగబడేలా చేసింది. ఈ చిత్రానికి టాక్ పరమ చెత్తగా వచ్చింది. అసలు రివ్యూ చేయడమే దండగ అని క్రిటిక్స్ అభిప్రాయపడ్డారు. అయితేనేం.. ఈ చిత్రం తొలిరోజు 1.9 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయగా, రెండో రోజు అంటే శనివారం 2.4 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందీ సినిమా. ఇక ఆదివారం వసూళ్లు శనివారం కంటే ఎక్కువే వచ్చినట్లు తెలుస్తోంది. నిర్మాతలు శనివారంతోనే లాభాల్లోకి వెళ్లిపోయారంటే ఇదెంత బెస్ట్ బిజినెస్ అన్నది అర్ధం చేసుకోవచ్చు. ఆదివారం నుండి ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లన్నీ లాభాల కిందే లెక్క. ఏ పెద్ద సినిమా రెండో రోజుకే లాభాల్లోకి వెళుతుంది చెప్పండి.

విడుదలకు ముందు ఈ చిత్ర యూనిట్ మాట్లాడిన మాటలు కూడా ఇలాగే ఉన్నాయి. గతంలో తాము ఒక మంచి సినిమా తీసి దారుణంగా మునిగిపోయామని, ఇప్పుడు బూతు కంటెంట్ తో సినిమా తీస్తే విపరీతమైన క్రేజ్ వచ్చిందని అన్నారు. అలాగే టైటిల్ కు కథకు లింక్ ఏంటి అని అడుగుతున్నారు, అసలు ఇందులో కథే లేదు. యూత్కు కావలసిన కంటెంట్ మాత్రం పక్కాగా ఉంది. సెన్సార్ చేసినోళ్లు కూడా సిగ్గుపడిపోయారంటూ పచ్చి నిజాలు చెప్పి ఈ సినిమాను ప్రమోట్ చేసారు. ఇంత ఓపెన్ గా ప్రమోట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తుండడంతో భవిష్యత్తులో ఎటువంటి సినిమాలు వస్తాయోనని కంగారు మొదలైంది.