ఏడు చేపల కథ మూవీ రివ్యూ


Yedu Chepala Katha movie review in Telugu
Yedu Chepala Katha movie review in Telugu

ఏడు చేపల కథ మూవీ రివ్యూ
నటీనటుల : అభిషేక్ పచ్చిపాల, అయేషా సింగ్, భాను శ్రీ, మేఘన చౌదరి, సునీల్ కుమార్ తదితరులు
దర్శకత్వం : శ్యామ్ జె చైతన్య
నిర్మాణం: జీవిఎన్ శేఖర్ రెడ్డి
సంగీతం: కవి శంకర్
రేటింగ్ : 2/5

ప్రేక్షకులలో ఆసక్తి కలిగించాలంటే ఈరోజుల్లో బెస్ట్ ప్రమోషన్ టీజర్ రిలీజ్. చిన్న వీడియో బిట్ తో సినిమలోని ఆసక్తికర అంశాలను కట్ చేసి టీజర్ వదిలి ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితే చాలు మిగతా పని ఆ టీజర్ చూసుకుంటుంది. ప్రోమోలతో విపరీతమైన ఆసక్తి కలిగించిన ఏడు చేపల కథ చిత్రం ఈరోజు విడుదలైంది. టీజర్, ట్రైలర్ లో బూతును, అస్లీల సన్నివేశాల పరంగా కొత్త పుంతలు తొక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :
టెంప్ట్ రవి (అభిషేక్ పచ్చిపాల) పేరుకి తగ్గట్లే ఎవరైనా అమ్మాయి కొంచెం అందంగా కనిపిస్తే చాలు తెగ టెంప్ట్ అయిపోతాడు. అయితే రవి ఎవరినైతే చూసి టెంప్ట్ అవుతాడో వాళ్ళంతట వాళ్ళే వచ్చి రవితో రాత్రి గడిపి వెళుతుంటారు. ఇది చాలదన్నట్లు రవి తలసేమియా వ్యాధితో బాధపడుతుంటాడు. ప్రతి 30 రోజులకు ఒకసారి తను రక్తమార్పిడి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉండగా రవి భావనను (అయేషా సింగ్) చూసి ప్రేమలో పడతాడు. దాంతో అయేషా కూడా రవితో ఒక రాత్రి గడుపుతుంది. దీనివల్ల రవి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు రవి టెంప్ట్ అయితే అమ్మాయిలు అలా ఇంటికి వచ్చేస్తారు? ఈ కథకు ఆత్మలతో రొమాన్స్ చేసే సుందరానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో లభిస్తాయి.

నటీనటులు :
అభిషేక్ పచ్చిపాల మంచి ఈజ్ తో నటించాడు. టెంప్ట్ అయిన సందర్భాల్లో అభిషేక్ నటన నవ్వు తెప్పిస్తుంది. సరైన సినిమా పడితే తనను తాను ప్రూవ్ చేసుకోగలడు అనిపిస్తుంది. అయేషా సింగ్ పర్వాలేదు. భాను శ్రీ నటన బాగుంది. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన అమ్మాయిలు గ్లామర్ ఒలికించడానికి, మొహమాట పడకుండా నటించడానికి పోటీ పడ్డారు. మిగిలిన వాళ్లంతా మామూలే.

సాంకేతిక వర్గం :
దర్శకుడిగా శ్యామ్ జె చైతన్య విఫలమయ్యాడు. ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను తీయలేకపోయాడు. ఒక సీన్ కు మరొక సీన్ కు సంబంధం లేకుండా సన్నివేశాలు అల్లాడు. స్క్రీన్ ప్లే అయితే ఒక ఫ్లో అంటూ లేకుండా అస్తవ్యస్తంగా తయారైంది. నిర్మాత శేఖర్ రెడ్డి, సినిమాకి ఏం అవసరమో అవన్నీ సమకూర్చిన భావన కలుగుతుంది. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. కవి శంకర్ నేపధ్య సంగీతం కొన్ని చోట్ల బాగుంది. ఎడిటింగ్ కు ఇంకాస్త పని చెప్పి ఉండాల్సింది.

చివరిగా :
మంచి సినిమా తీస్తే చూడలేదని ఇలాంటి సినిమా తీసాం అన్నాడు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరో అభిషేక్. అయితే ఇక్కడ హీరో గమనించాల్సింది ఒకటుంది. సినిమా మంచిదైనా, బూతుతో నిండినదైనా కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటేనే సినిమా విజయం సాధిస్తుంది. బూతు నింపేసాం కదా అని ఎలా పడితే అలా సన్నివేశాలు తీసుకుంటూ వెళ్ళిపోతే అది ఏడు చేపల కథగా తయారవుతుంది. ఏ మాత్రం అర్ధం పర్ధం లేని సన్నివేశాలతో సాగే ఏడు చేపల కథ ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా కష్టం.