వాల్మీకి విషయంలో ఏం జరుగుతోంది?Valmiki
వాల్మీకి విషయంలో ఏం జరుగుతోంది?

ఈరోజుల్లో సినిమాలో కంటెంట్ ఎలా ఉందన్న సంగతి పక్కనపెడితే జనాలను థియేటర్లకు తీసుకురావడం ప్రధాన పనిగా మారిపోయింది. ఎందుకంటే మెజారిటీ రికవరీ సినిమాకు మొదటి మూడు రోజుల్లోనే అయిపోవాలి. అందుకే కంటెంట్ ఓ మోస్తరుగా ఉన్నా ప్రమోషన్లు అదరగొట్టిన చిత్రాలకు అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్స్ వచ్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రమోషన్స్ ను ఈ మధ్య అందరూ చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు.

అయితే ఈ విషయాన్ని వాల్మీకి చిత్ర యూనిట్ పెద్ద కన్సిడర్ చేస్తున్నట్లు కనిపించట్లేదు. ట్విట్టర్ లో వరుణ్ తేజ్, హరీష్ శంకర్ ఏదో అడపాదడపా పోస్టర్లు విడుదల చేయడం తప్పితే సీరియస్ గా ప్రమోషన్స్ ఇంకా షురూ కాలేదు. సినిమా విడుదలకేమో ఇంకా వారం రోజుల సమయం కూడా లేదు. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 15న నిర్వహిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. బహుశా ఈ ఈవెంట్ తర్వాత నుండి ప్రమోషన్ల స్థాయిని పెంచుతారేమో.

మరోవైపు వాల్మీకి టైటిల్ విషయంలో జరుగుతున్న రగడ కూడా టీమ్ ను ఇబ్బంది పెడుతోంది. అది క్లియర్ అయితే గానీ టీమ్ ప్రశాంతంగా ఉండలేరేమో. వరుణ్ తేజ్, అధర్వ నటిస్తున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మిస్తోంది. హరీష్ శంకర్ దర్శకుడు, మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు.